Ustaad Bhagat Singh | రాజకీయాల వలన కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్స్‌కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను కమిటైన ప్రాజెక్ట్‌లు పూర్తి చేసే పనిలో పడ్డారు. దాదాపు రెండేళ్ల క్రితం మేనల్లుడు సాయి దుర్గా తేజ్ తో కలిసి ‘బ్రో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ఆ తర్వాత వెండితెరపై కనిపించింది లేదు. జూలై 28, 2023లో పవన్ చివరి చిత్రం విడుదల అయ్యింది . అయితే ‘హరి హర వీరమల్లు’తో ఈ నెల 12న థియేటర్లలోకి వస్తారని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాని పలు కారణాల వలన ఈమూవీ మళ్లీ పోస్ట్ పోన్ అయింది. మరోవైపు తాను కమిట్ అయిన ఓజీ చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు.
పవన్ కమిటైన మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత హరీష్, పవన్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకి దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హరీశ్ శంకర్ జూన్ రెండవ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చామని హరీష్ తెలియజేయడంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న అవైటెడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రం చాలా కాలం గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధం అయ్యింది. ఈరోజు (జూన్ 10) నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పునః ప్రారంభం అయ్యినట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలతో షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుండగా, జూన్ 12 లేదా 13వ తేదీన పవన్ సెట్స్ లో జాయిన్ అవుతారని టాక్. ఈ షెడ్యూల్ మొత్తం 30 రోజుల పాటు జరగనుంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.