Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అందాల తారలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించడంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేకపోయాయి. దీనికి ప్రధాన కారణంగా అదే సమయంలో విడుదలైన ధురంధర్ 2 చిత్రం. ఈ మూవీ భారీ విజయం నమోదు చేస్తున్న క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ హవా తగ్గింది.
ధురంధర్ 2 సినిమా సృష్టిస్తున్న రికార్డుల దూకుడు మధ్య ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తన థియేట్రికల్ రన్లో పూర్తి స్థాయిలో రాణించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను త్వరగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఏప్రిల్ 24న ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి రెస్పాన్స్ సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం థియేటర్లలో ఎదుర్కొన్న సవాళ్ల తర్వాత, ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎలా ఆదరిస్తారో చూడాలి. కాగా, పవన్ కళ్యాణ్ చివరి చిత్రం ఓజీ బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.