Upasana | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ అయిన ఉపాసన కొణిదెల తాజాగా చేసిన ఒక భావోద్వేగపు పోస్ట్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తనను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిన దానికి కారణం వారసత్వం గానీ, వివాహ బంధం గానీ కాదని, అనేక ఒత్తిళ్లు, బాధలను ఎదుర్కొంటూ తన స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగానని స్పష్టం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే ఆసక్తికరమైన ఆలోచనను పంచుకున్న ఉపాసన, ఒక వ్యక్తిని నిజంగా గొప్పవాడిని చేసే అంశం ఏమిటి? అనే ప్రశ్నను లేవనెత్తారు. డబ్బు, హోదా, కీర్తి మాత్రమే గొప్పతనానికి ప్రమాణాలా? లేక భావోద్వేగ స్థిరత, ఇతరుల కోసం చేసే సేవా తపన కూడా అంతే ముఖ్యమా? అనే అంశాన్ని ఆమె విశ్లేషించారు.
“నేను ఎవరి దయ వల్లా ఎదగలేదు. ఒత్తిడిని, అణచివేతను ఎదుర్కొని, ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేచి ముందుకెళ్లాను. నా మీద నాకే నమ్మకం!” అంటూ తన జీవిత ప్రయాణాన్ని గుండెల్లోంచి బయటపెట్టారు ఉపాసన. అంతేకాదు, “అసలైన బలం ఆత్మగౌరవంలో ఉంటుంది. డబ్బు, హోదా, ఫేమ్ వంటి వాటితో సంబంధం లేదని చెప్పుకొచ్చింది. అహంకారం అనేది కొంత గుర్తింపుని కోరుకుంటుంది, కానీ ఆత్మగౌరవం ఎలాంటి శబ్దం లేకుండా స్వయంగా గుర్తింపును ఏర్పరుచుకుంటుంది” అని ఆమె చెప్పిన మాటలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారాయి.
డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలిగా, అపోలో గ్రూప్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా, ప్రస్తుతం ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తూ సామాజిక సేవలో తనని తాను నిరూపించుకుంటున్నారు ఉపాసన. 2012లో రామ్ చరణ్‌తో వివాహం చేసుకున్న ఉపాసన, 2023లో కుమార్తె క్లీంకారకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఓ తల్లి, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా ఎన్నో పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఉపాసన సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ సమాజానికి విలువైన సలహాలు, సూచనలు అందిస్తుంటుంది.