‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా అనగానే ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని విపరీతంగా పెంచాయి. భారీ తారాగణంతో, హాలీవుడ్ స్థాయి అత్యున్నత సాంకేతిక విలువలతో, ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ‘టాక్సిక్’ విడుదలైంది. మరి అందరి అంచనాలను ఈ చిత్రం నిజం చేసిందా? హీరో యశ్ ‘కేజీఎఫ్’ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేశాడా? పూర్తి సమీక్షలోకి వెళితే…
కథాంశం
గంగా (నయనతార), రాయ (యశ్) అక్కాతమ్ముళ్లు. చిన్నతనంలోనే అమ్మానాన్న దూరం కావడంతో, రాయను గంగే కన్నతల్లిలా పెంచి పెద్ద చేసింది. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తమ్ముడిని సంరక్షించింది. చిన్నతనం నుంచే నేర ప్రపంచంలో పెరగడంతో ఇద్దరూ అదే నేర ప్రవృత్తితో ఎదుగుతారు. గోవా నేరసామ్రాజ్యానికి తన తమ్ముడిని అధిపతిగా చూడాలని గంగ కోరుకుంటుంది. అందుకోసం అప్పటికే గోవాను ఏలుతున్న ఒక మాఫియా డాన్‌తో ఆమె చేతులు కలుపుతుంది. ఆ గ్యాంగ్‌లో రాయ కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. మాఫియా డాన్ కూతురు రెబెక్కా (తార సుతారియా) రాయకు చేరువవుతుంది, ఇద్దరూ ఒకటవుతారు. మరోవైపు, ప్రత్యర్థుల దాడులు, ప్రతిదాడులతో కథ సాగుతుండగా… రాయకు రాయల్ సర్కస్‌లో పనిచేసే నాడియా (కియారా అద్వానీ) పరిచయం అవుతుంది. మానసికంగా, శారీరకంగా ఇద్దరూ దగ్గరవుతారు. ఈ క్రమంలో నాడియా గర్భవతి అవుతుంది. తన కూతురిని కాదని వేరొక అమ్మాయితో రాయ తిరుగుతున్నాడని తెలిసి మాఫియా డాన్ మండిపడతాడు. ఈ ఘర్షణలో ఆ డాన్ రాయ చేతిలో హతుడవుతాడు. అనుకోని పరిస్థితుల్లో శత్రువుల చేతుల్లో రాయ అక్క గంగ, ప్రియురాలు నాడియా చిక్కుకుంటారు. కడుపులో ఉన్న బిడ్డను చంపుతామని బెదిరించి, నాడియా చేతులతోనే గంగను దుండగులు చంపిస్తారు. అక్క చావుకు కారణమైన ప్రియురాలిని రాయ క్షమించాడా? శిక్షించాడా? నాడియా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అక్క కోరిక ప్రకారం రాయ గోవా మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
ఇది చాలా సాధారణమైన కథ. ‘కేజీఎఫ్’లో హీరో ఎలాగైతే నేర ప్రపంచంలో పెరిగి డాన్‌గా ఎదుగుతాడో, ఇందులోనూ దాదాపు అదే ధోరణి కనిపిస్తుంది. అందులో ‘అమ్మ సెంటిమెంట్’ ఉంటే, ఇందులో ‘అక్క సెంటిమెంట్’ ప్రధానంగా నడుస్తుంది. తప్పు చేసిన ఒక తండ్రి మానసిక వేదనే ఈ సినిమా కథ అని చెప్పవచ్చు. సినిమా ప్రథమార్థం ఒక సాధారణ మాఫియా సినిమా మాదిరిగా అనిపించినా, ద్వితీయార్థంలో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ మలుపునకు సంబంధించిన సంఘర్షణ ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తుంది. ఏదేమైనా, బలమైన కథ కంటే యాక్షన్ అంశాలకే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆద్యంతం నరుక్కోవడాలు, చంపుకోవడాలు, కాల్పులు, మధ్యమధ్యలో ఇంటెన్స్ సీన్స్‌తో సినిమా సాగుతుంది. కుటుంబ ప్రేక్షకులు అందరూ కలిసి చూసే విధంగా ఈ చిత్రం లేదు. అయితే, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సినిమాను ఎంతో రిచ్‌గా, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో తెరకెక్కించారు.
నటీనటుల అభినయం
యశ్ ఇందులో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి రాయ పాత్రకు, కొడుకు టికెట్ పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. ముఖ్యంగా రాయ పాత్రలో యశ్ తన విశ్వరూపం చూపించారనే చెప్పాలి. కొడుకు పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా బరువు కూడా తగ్గారు. ద్వితీయార్థంలో ఆ పాత్ర ఎదుర్కొనే సంఘర్షణ విభిన్నంగా ఉంటుంది. యశ్ అక్క గంగగా నయనతార చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించారు. ఇందులో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటాయి. కియారా అద్వానీ భావోద్వేగభూయిష్టమైన పాత్రలో చక్కగా నటించారు. తార సుతారియా, రుక్మిణీ వసంత్ పాత్రలు కేవలం గ్లామర్‌కే పరిమితమయ్యాయి.
సాంకేతిక నిపుణులు
చెప్పుకోదగ్గ కొత్తదనం లేని కథ అయినప్పటికీ, నిర్మాణ విలువలు, మేకింగ్ పరంగా సినిమా అద్భుతంగా ఉంది. గీతూ మోహన్‌దాస్ స్క్రీన్‌ప్లేను సగటు ప్రేక్షకుడు పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కథ, కథనాలపై మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టారు. తెరపై ప్రతి పైసా కనిపించింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం, కెమెరా పనితనం సినిమా స్థాయిని మరింత పెంచాయి. మొత్తంగా సాంకేతికంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. యాక్షన్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్
యశ్ అద్భుతమైన నటన
స్టైలిష్ మేకింగ్ & ప్రొడక్షన్ వాల్యూస్
హీరోయిన్ల గ్లామర్
అడ్రినలిన్ రష్ తెప్పించే యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ & కథనం
రేటింగ్: 3