Tollywood | కొత్త ఏడాదిలో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాలు మంచి వినోదం పంచాయి. డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులని పలకరించగా, వాటికి మంచి ఆదరణ లభించింది. అయితే గడిచిన జనవరి, ఫిబ్రవరి మార్చి నెలల్లో సుమారు 60 సినిమాలు రిలీజ్ కాగా, ఇందులో నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టినవి అరడజను మాత్రమే ఉన్నాయి. ముందుగా సంక్రాంతి కానుకగా జనవరిలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో రిలీజైన రామ్ చరణ్, శంకర్ ల ‘గేమ్ ఛేంజర్’ మూవీ డిజాస్టర్ గా మారింది.
ఈ రెండు చిత్రాలు దిల్ రాజు బ్యానర్లో రూపొందగా, ఒక సినిమా లాభాలు తెచ్చిపెడితే మరో సినిమా నష్టాలు తెచ్చింది. ఏది ఏమైన బ్యాలెన్స్ అయితే అయింది. ఇక సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన మరో మూవీ డాకు మహరాజ్. నందమూరి బాలకృష్ణ, బాబీల కలయికలో రూపొందిన ఈ సినిమా యావరేజ్ టాక్‌తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.ఇక ఫిబ్రవరి నెలలో వచ్చిన ‘తండేల్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. చైతూ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు.
అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. డ్రై సీజన్ లో రిలీజ్ అయి తొలి రోజే హెచ్ డీ ప్రింట్ లీకైన కూడా ఈ సినిమాకి ఇంత ఆదరణ లభించడం గొప్ప విషయం. ఇక ఈ సినిమా తర్వాత ఫిబ్రవరిలో పట్టుదల, లైలా, బ్రహ్మా ఆనందం, ‘బాపు, రామం రాఘవం, ‘మజాకా, ‘శబ్దం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ మాత్రం ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇక మార్చి నెలలో రిలీజైన ‘కోర్ట్’ ఘన విజయం సొంతం చేసుకుంది. హీరో నాని సమర్పణలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లే రాబట్టి నిర్మాతలకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక నితిన్ రాబిన్ హుడ్ చిత్రం మార్చి నెలాఖరులో రాగా, ఈ మూవీకి మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ఊహించని వనంబర్స్ రాబడుతోంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో రూపొందిన ‘L2: ఎంపురాన్’.. విక్రమ్ ‘వీర ధీర సూర’ సినిమాలకి మంచి టాక్ వచ్చిన కూడా వసూళ్లు రావడం లేదు. ‘దిల్ రూబా’ నిరాశ పరచగా, హిందీ లో సూపర్ హిట్ అయిన ఛావా తెలుగులో విడుదలై పర్వాలేదనిపించింది.