‘ఈ రోజు మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా’ అంటూ మంగళవారం ఉదయం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అగ్ర కథానాయిక సమంత పెట్టిన పోస్ట్ అందరిలో ఆసక్తిని పెంచింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి లేదా కొత్త సినిమా తాలూకు విశేషాలను ఏమైనా వెల్లడిస్తుందేమోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. అయితే అందరి ఊహలకు భిన్నంగా తాను ఓ స్పోర్ట్స్ ఫ్రాంఛైజీలో భాగమైనట్లు తెలిపింది. టెన్నిస్, టేబుల్ టెన్నిస్‌ను పోలి ఉండే పికిల్‌బాల్ గేమ్‌కు అమెరికాలో మంచి ఆదరణ ఉంది. గతకొంతకాలంగా మనదేశంలో కూడా ఆదరణ లభిస్తున్నది. టెన్నిస్ తరహాలోనే సింగిల్స్, డబుల్స్‌లో ఈ ఆటను ఆడొచ్చు. వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన సమంతా.. తన జీవితంలో ఇదొక కొత్త ప్రయాణమని ఆనందం వ్యక్తం చేసింది. ‘న్యూ బిగినింగ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.