Tollywood| టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగింది. మీడియం రేంజ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరు కూడా భారీ బడ్జెట్‌తో చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఏది పడితే అది ఒప్పుకోకుండా మంచి కథని సెలక్ట్ చేసుకొని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటి బిజినెస్ ఏకంగా 1200 కోట్ల రూపాయల పైనే అంటున్నారు. ఇప్పటి నుండే ఆ మూవీలకి సంబంధించి ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తుంది. ఇక ఈ మూడు సినిమాలు ఒకే నెలలో సందడి చేయబోతుండడం హాట్ టాపిక్‌గా మారింది.
ముందుగా 2026 మార్చి 26.. ఈ డేట్ ముందుగా నాని లాక్ చేసుకున్నాడు. ఎలాగైన ది ప్యారడైజ్ సినిమాని ఆ టైంకి దింపే పనిలో ఉన్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా ఇదే కాగా, ఈ మధ్యే టైటిల్ టీజర్ విడుదలైంది.ఇది చూసిన ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోయింది. నాని గెటప్ చూసే అందరు షాక్ అయిపోయారు. ఇక నాని వస్తున్న ఆ రోజే.. రామ్ చరణ్ కూడా రావాలని చూస్తున్నారు. బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ సైతం మార్చి 26 2026 గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రామ్ చరణ్, నానిల బిజినెస్ దాదాపు 700 కోట్ల పైమాటే. రామ్ చరణ్‌కు రంగస్థలం, ట్రిపుల్ ఆర్ మార్చిలోనే విడుదలై పెద్ద హిట్ అందించిపెట్టాయి. మరోవైపు నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన దసరా చిత్రం కూడా మార్చిలోనే వచ్చింది. అందుకే వారు తమ సినిమాలని మార్చిలోనే రిలీజ్ చేయాలనే కసితో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన యష్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. మార్చి 19, 2026న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా బిజినెస్ 400 కోట్లకు పైగానే జరుగుతుంది. మొత్తానికి 2026 మార్చి ప్యాన్ ఇండియన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కాగా, ఈ మూడు సినిమాలు సౌత్ ఇండియా స్థాయిని పెంచుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.