భారతీయ సినీ సంగీత గగనాన లతాజీ కార్తీక పున్నమి వెన్నెలమ్మ అయితే, ఆశాజీ హేమంత సూర్యుడి కాంతులమ్మ.. లతాజీ గానం గంభీరంగా ప్రవహించే గంగా నది వంటిదైతే . ఆశాజీ గానం ఎన్నో వంపులు సొంపులతో సాగే గల గల పారే గోదావరి.. లతాజీ సంప్రదాయానికి సంస్కృతికి ప్రతీక అయితే, ఆశా భోంస్లే వైవిధ్యానికి, ఆధునికతకు చిహ్నం. ఈ వైవిధ్యం, ప్రయోగాత్మక ధోరణిలోనే ఆమె తన సోదరిని సైతం మించిపోయారని సంగీత విశ్లేషకులు భావిస్తారు. లతాజీ మెలోడీ క్వీన్ గా స్థిరపడితే, ఆశా ‘క్వీన్ ఆఫ్ గూవ్’ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు.
సినీ సంగీతాన్ని 75 సం.ల పాటు శాసించిన ప్రముఖ గాయనీమణి ఆశాభోంస్లే సాక్షాత్తు గాన కోకిల లతామంగేష్కర్ సొంత చెల్లెలు ! వీరిరువురూ ఒకే కొమ్మకు పూచిన రెండు పువ్వులయినప్పటికీ, ఒకే వృత్తి అయినప్పటికీ ప్రవృత్తులు వేరు.
ఆశా భోంస్లే కాలంతో సాగిపోయారు.. ఏ తరహా పాటల నైనా అలవోకగా పాడారు. శాస్త్రీయ సంగీతం, భజనలు, గజల్స్, పాప్, జానపద గీతాలు, ఆధునిక క్యాబరే సాంగ్స్ ఇలా ప్రతి విభాగంలోనూ తన ముద్ర వేశారు. భారతీయ భాషలే కాకుండా రష్యన్, ఇంగ్లిష్ వంటి విదేశీ భాషల్లో కూడా పాటలు పాడారు. సుమారు 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలను పాడారు .1940ల నుండి నేటి వరకు ప్రతి తరం సంగీతానికీ అనుగుణంగా తన గాత్రాన్ని మార్చుకుంటూ ఆమె నిరంతరం కొత్తదనంతో ఉండగలిగారు. అందుకే గిన్నిస్ బుక్ సైతం ఆమెను అత్యధిక పాటలు పాడిన గాయనిగా గుర్తించింది.
గున్ గు నారహీహై భవెరె ( ఆరాధన)
’చురా లియా హై తుమ్నే’
(యాదోన్ కీ బారాత్)
’అభి నా జావో ఛోడ్ కర్’ (హమ్ దోనో)
’ఉడెన్ జబ్ జబ్ జుల్ఫేన్ తేరీ’
(నయా దౌర్)
’ఓ మేరే సోనా రే’ (తీసీ మంజిల్)
జానే జాన్ ..(జవానీ దివానీ )
లే జాయేంగే లే జాయేంగె
(చోర్ మచాయే షోర్)
జానే మన్ జానే మన్ – (చిత్ చోర్ )
ఏ మేరె దిల్ ప్యార్ కా దీవాన( డాన్ )
ఆజ్ రపట్ జాయే తో ( నమక్ హలాల్)
మొదలైనవి కేవలం స్ఫురించిన
ఉదాహరణలు మాత్రమే !!
‘ఉమావ్ జాన్’ చిత్రంలోని ‘దిల్ చీజ్ క్యా హై’, ‘ఇన్ ఆంఖోన్ కీ మస్తీ కే’ పాటల్లో ఆమె గాత్రం ఎంతో గంభీరంగా, లలితంగా ఉంటుంది. ‘కారవాన్’ చిత్రంలోని ‘పియా తూ అబ్ తో ఆజా’, ‘డాన్’ చిత్రంలోని ‘యే మేరా దిల్..’ పాటల్లో ఆమె చూపిన ఎనర్జీ, శ్వాసపై నియంత్రణ అద్భుతం.
దమ్ మారో దమ్ (హరే రామ హరే కృష్ణ) వంటి హిప్పీ ైస్టెల్ పాటలను పాడటంలో ఆశాజీ కి సాటిలేరు. ఇటువంటి వెస్ట్రన్ బీట్స్ ఉన్న పాటలు లతా మంగేష్కర్ శైలికి దూరంగా ఉండేవి. ‘చురా లియా హై తుమ్నే జో దిల్ కో’ వంటి పాటల్లో ఆమె గాత్రంలో ఒక రకమైన ’కిశోర ప్రాయపు ఉత్సాహం’ కనిపిస్తుంది, ఇది లతాజీ గంభీరమైన మెలోడీల కంటే భిన్నంగా ఉంటుంది.
కొన్ని పాటల్లో ఆమె చేసిన ప్రయోగాలు లతాజీ కూడా చేయని స్థాయిలో ఉంటాయి. ‘కటీ పతంగ్’ చిత్రంలోని ‘మేరా నామ్ హై షబ్నమ్’ పాటను భారతదేశపు మొట్టమొదటి రాప్ సాంగ్‌గా పరిగణిస్తారు. ఇందులో ఆమె మాట్లాడినట్లుగా పాడుతూనే సంగీతాన్ని పండించారు.
ఆశా భోంస్లే సినీ ప్రస్థానం 1943లో ‘మాఝా బాల్’ అనే మరాఠీ చిత్రంతో మొదలైంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దత్తా దవేకర్ . ఆమె పాడిన మొదటి పాట ‘చలా చలా నవ్ బాలా’. అలాగే హిందీలో ఆమెకు మొదటి అవకాశం హన్సరాజ్ బెహ్ల్ ఇచ్చారు. 1948లో విడుదలైన ‘చనారియా’ చిత్రంలో ‘సావన్ ఆయా’ అనే పాటలో ఆమె కోరస్ గాయనిగా తొలిసారి పాడారు.1949లో విడుదలైన ‘రాత్ కీ రాణి’ చిత్రంలో ఆమె తన మొదటి హిందీ సోలో పాటను పాడారు.
ఆమెకు గాయనిగా పూర్తిస్థాయి గుర్తింపును, సొంత శైలిని కలిగించిన సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్ . ముఖ్యంగా ‘నయా దౌర్’ (1957) చిత్రంతో ఆమె స్టార్ సింగర్‌గా ఎదిగారు.
మహారాష్ట్ర సాంగ్లీలోని గోర్ అనే చిన్న గ్రామంలో సంగీత కుటుంబానికి చెందిన పండిట్ దీనానాథ్ మంగేష్కర్, శేవంతి దంపతులకు 1933 సెప్టెంబర్ 8వ తేదీన ఆశా భోంస్లే జన్మించారు. తన సోదరి లతా మంగేష్కర్ కంటే ఆమె నాలుగు సంవత్సరాల చిన్న.
ఆశా భోంస్లే కెరీర్ ప్రారంభంలో, ఆమె గొంతు శంషాద్ బేగం గొంతును పోలి ఉందని చాలా మంది అనేవారు. వీరిద్దరి కాంబినేషన్లో ముఖ్యంగా ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. వీరు కలిసి పాడిన ‘కజా మొహబ్బత్ వాలా’ (కిస్మత్ 1968) ఎంతో ప్రజాదరణ పొందింది. అలాగే ‘సి.ఐ.డి’ (1956)లో ‘లేకే పెహ్లా పెహ్లా ప్యార్’ పాట కూడా ప్రాచుర్యం పొందింది..
1966లో వచ్చిన ‘తీస్రీ మంజిల్’ సినిమాతో ఆశా భోంస్లే వాయిస్ మరింత పాపులర్ అయింది. ’ఆజా ఆజా మే హూ ప్యార్ తేరా’ వంటి పాటలు ఆమె వెర్సటాలిటీని చాటి చెప్పాయి. ఖయ్యాం సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన ‘ఉమావ్ జాన్’ (1981) లోని గజల్స్ (’దిల్ చీజ్ క్యా హై’) ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా మొదటి జాతీయ అవార్డును తెచ్చిపెట్టాయి.
:ఏ.ఆర్. రెహమాన్ సంగీతంలో ’తన్హా తన్హా’, ’రంగీలా రే’ పాటల ద్వారా ఆమె 90వ దశకంలోనూ సంచలనం సృష్టించారు. ఆశా భోంస్లే, ఆమె అక్క లతా మంగేష్కర్ కలిసి సుమారు 50 నుండి 80 వరకు హిందీ పాటలు పాడారు. వీరిద్దరి స్వరం భిన్నంగా ఉన్నప్పటికీ, వారు కలిసి పాడినప్పుడు ఆ పాటలు అద్భుతమైన మెలోడీలుగా నిలిచాయి. ఉదాహరణకు పడోసన్ (1968) సినిమాలోని ‘మై చలీ మై చలీ’ పాట ఎంతో హుషారుగా ఉంటుంది.
ఆమె తన కెరీర్ ప్రారంభంలో అప్పటి సీనియర్లయిన జి.ఎం.దురానీ, ఎస్.డి.బాతిష్ (1951లో ’అదా’ చిత్రం కోసం) వంటి వారితో కలిసి పాడారు. ఆమె 90 ఏండ్ల వయసులో కూడా కొత్త తరం వారితో పాడటం విశేషం.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్‌లీ, తన మనవడు కైతన్య (చింటూ) భోంస్లేతో కలిసి వేదికలపై ఆల్బమ్స్ కోసం పాడారు. 2026లో ఆమె బ్రిటిష్ బ్యాండ్ Gorillazతో కలిసి ‘The Shadowy Light’ అనే పాటను కూడా పాడారు.
ఆమె అలనాటి నటీమణులు నర్గీస్, మధుబాల, మీనా కుమారి వంటి లెజెండరీ హీరోయిన్లకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. తన కెరీర్ చివరి దశలో ఊర్మిళ మండోద్కర్ (రంగీలా), ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ వంటి ఆధునిక హీరోయిన్లకు కూడా తన గాత్రాన్ని అందించారు.
మహ్మద్ రఫీతో కలిసి ఆశా భోంస్లే సుమారు 900 పైగా పాటలు పాడారు. కిశోర్‌కుమార్‌తో ఆమె పాడిన పాటలు దాదాపు 600 నుండి 700 మధ్యలో ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో మెలోడీలు, రొమాంటిక్ సాంగ్స్ మాత్రమే కాకుండా, ఉత్సాహభరితమైన క్యాబరే సాంగ్స్, ఖవాలీలు, శాస్త్రీయ బాణీలు కూడా ఉన్నాయి.
2002లో ఆమె ’ఆప్ కీ ఆశా’ అనే ఆల్బమ్‌తో సంగీ త దర్శకురాలిగా మారారు. దీనికి మజూహ్ సుల్తాన్ పురి సాహిత్యం అందించగా, సచిన్ టెండూల్కర్ ఈ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పాకిస్థానీ గాయకుడు అద్నాన్ సమీ ప్రతిభను ఆమె చిన్నప్పుడే గుర్తించి, సంగీతాన్ని వృత్తిగా ఎంచుకోమని ప్రోత్సహించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ’కభీ తో నజర్ మిలావ్’ ఆల్బమ్ అత్యధిక ప్రజాదరణ పొందింది.
ఆశా భోంస్లే జీవితంలో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులతో ప్రేమ, వివాహం ముడిపడి ఉన్నాయి.. తన అక్కయ్య లతా మంగేష్కర్ పర్సనల్ సెక్రటరీ అయిన గణపతిరావు భోంస్లే ను ప్రేమించి, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి పెండ్లి చేసుకున్నారు. అయితే, ఈ వివాహం ఆమెకు ఎన్నో కష్టాలను మిగిల్చింది.
ఆయన తనను, పిల్లలను వేధించడంతో, 1960లో ఆమె ముగ్గురు పిల్లలతో బయటకు వచ్చేశారు. చాలా ఏండ్ల తర్వాత, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ (పంచమ్ దా) తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య సంగీతం పట్ల ఉన్న ఇష్టం ప్రేమగా మారి 1980లో వివాహం చేసుకున్నారు. ఆయన చనిపోయే వరకు (1994) వీరి బంధం కొనసాగింది. ఆశా భోంస్లే ముగ్గురు పిల్లల్లో పెద్దకొడుకు హేమంత్ భోంస్లే పైలెట్‌గా పనిచేసి ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారారు. 2015లో క్యాన్సర్‌తో మరణించారు. కుమార్తె వర్షా భోంస్లే జర్నలిస్టే కాకుండా గాయని కూడా. కాని ఆమె 2012లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. చిన్నబ్బాయి ఆనంద్ భోంస్లే ఒక్కడే తల్లితో ఉంటున్నాడు.
ఆశా భోంస్లే పాట కోసమే పుట్టారు. పాటతోనే జీవించారు. తన 91వ ఏట తన మనవరాలు జానై భోంస్లేతో కలిసి నితిన్ శంకర్ సంగీతంలో పాడిన పాట అందుకు ఉదాహరణ ఆశాభోంస్లే కేవలం ఒక గాయని మాత్రమే కాదు! అలుపెరుగని పోరాట పటిమకు ఆమె ఒక నిలువెత్తు నిదర్శనం. సినిమా రంగంలో ఎన్ని పోటీలు ఎదురైనా, వ్యక్తిగత జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఆమె ఎప్పుడూ తన గౌరవాన్ని వీడలేదు. ఒక రాణిలా సంగీత సామాజ్యాన్ని ఏలుతూ, నేటికీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆశా జీ.. నిజంగానే ఒక ’షాన్’ (గౌరవం) తో కూడిన సంగీత శిఖరం.
‘ప్యార్ కర్నే వాలే ప్యార్ కర్తే హై షాన్ సే.. జీతే హై షాన్ సే.. మర్తే హై షాన్ సే’ అని ‘షాన్’ చిత్రం (1981) కోసం ఆశాజీ పాడిన గీతం, ఆమె జీవన తాత్వికతను ప్రతిబింబిస్తుందనిపిస్తుంది. ఆ గీతమే అశేష సంగీత అభిమానుల పక్షాన సమర్పించే స్వరాంజలి..
– డాక్టర్.వి.వి.రామారావు
98492 37663 సినీ సంగీత,సాహిత్య విశ్లేషకుడు