Hansika | సినీ పరిశ్రమలో సెలబ్రిటీల విడాకులు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. ప్రేమగా మొదలైన బంధాలు అనుకోని కారణాలతో ముగిసిపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంటుంది. తాజాగా నటి హన్సిక తన వైవాహిక జీవితానికి ముగింపు పలికిన అనంతరం మొదటిసారి ఈ అంశంపై బహిరంగంగా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భర్త సోహైల్ ఖతూరియాతో విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హన్సిక తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను వివరించారు. జీవితంలో కొన్ని నిర్ణయాలు కఠినంగా అనిపించినప్పటికీ, అవి మన మంచికే అయితే వాటిని ఆలస్యం చేయకుండా తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఒక నిర్ణయం తప్పు అని అనిపిస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి వెనుకాడకూడదు. గత రెండేళ్లుగా నా మానసిక పరిస్థితి చాలా ప్రభావితమైంది. సాధారణంగా నేను చాలా ఉల్లాసంగా, ఆనందంగా ఉండే వ్యక్తిని. కానీ ఆ సమయంలో పూర్తిగా నిశ్శబ్దంగా, బాధతో ఉండేదాన్ని. నా పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందారు అని హన్సిక తెలిపారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఒక స్నేహితురాలు అండగా నిలిచిందని ఆమె చెప్పారు. నా పరిస్థితిని గమనించిన ఓ స్నేహితురాలు డాక్టర్ను సంప్రదించి నాకు థెరపీ అవసరమని సూచించింది. ఆ తర్వాత నేను కౌన్సెలింగ్ తీసుకున్నాను. ఆ ప్రక్రియ నాకు ఎంతో సహాయపడింది. ఈ రెండేళ్లు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించాయి. సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు సాగాలి అనే విషయాలు నేర్చుకున్నాను అని వెల్లడించారు.
విడాకుల తర్వాత తనపై సోషల్ మీడియాలో, మీడియాలో వచ్చిన ప్రచారాలపై కూడా హన్సిక స్పందించారు. ప్రజలు ఎక్కువగా సంచలన వార్తలనే ఇష్టపడతారు. అందుకే నా గురించి కూడా అనేక రకాల గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటికి నేను ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వాలనుకోవడం లేదు. ఇతరులు ఏమనుకుంటారన్నది కంటే నా సంతోషం నాకు ముఖ్యం అని స్పష్టం చేశారు. అలాగే తమ విడాకుల నిర్ణయం పరస్పర అంగీకారంతో తీసుకున్నదేనని హన్సిక తెలిపారు. వివాహం అనేది ఇద్దరి వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడాలి. కానీ మా పరిస్థితిలో అది జరగలేదు. అందుకే మేమిద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. ప్రస్తుతం తాను జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నానని, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నానని హన్సిక వెల్లడించారు. ఒంటరిగా గడపడం, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం ద్వారా మనశ్శాంతి పొందుతున్నానని తెలిపారు. ఈ కష్టకాలంలో తన కుటుంబ సభ్యులు అందించిన మద్దతును ఆమె ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.