Thalapathy Vijay | దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కెరీర్లో 69వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమానే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. శనివారం మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన జననాయగన్ సినిమా ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. సినిమాలకు స్వస్తి చెప్పడం తనకు ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు. ‘నా ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నా అని విజయ్ చెప్పుకోచ్చాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విజయ్ ఆశయాలకు, ఆయన పార్టీ సిద్ధాంతాలకు అద్దం పట్టేలా ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. విజయ్ ఇప్పటికే ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే రాజకీయ పార్టీని స్థాపించి, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.