ప్రతి శుక్రవారం.. కొత్త సినిమాలు పలకరిస్తుంటాయి. వీటిలో కొన్ని బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తాయి. వచ్చాయని తెలిసేలోపే మరికొన్ని తెరమరుగవుతాయి. కానీ, కొన్ని అరుదైన సినిమాలు.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతాయి. మరపురాని చిత్రాలుగా నిలిచిపోతాయి. సంవత్సరాలు దాటినా వాటికి అంతే క్రేజ్ ఉంటుంది. మాయాబజార్, శంకరాభరణం తరహా క్లాసిక్ చిత్రాలు ఆ కోవకే చెందుతాయి. యాక్షన్ చిత్రాలను ఆ స్థాయిలో గుర్తుంచుకోవడం అరుదైన విషయమే! ఆంగ్ల పత్రిక ‘మింట్’ ఈ తరం మెచ్చిన యాక్షన్ సినిమాల చిట్టా విప్పింది! యాభై యాక్షన్ థ్రిల్లర్స్ జాబితాలో ఆరు తెలుగు సినిమాలూ చోటు దక్కించుకున్నాయి. వాటి విశేషాలివి..
భావోద్వేగ ప్రతీకారం
తెలుగు సినిమాకు దక్కిన వజ్రపు తునక రాజమౌళి. ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’ తదితర కమర్షియల్ సక్సెస్ సినిమాలు అందించిన రాజమౌళిని వినూత్న దర్శకుడిగా పరిచయం చేసిన చిత్రం ‘ఈగ’. సమంత, నాని, కిచ్చ సుదీప్ ప్రధాన తారాగణంగా పేర్కొన్నా… కథంతా నడిపించింది ఈగే! గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేసి తనను జక్కన్న అని ఎందుకు పిలుస్తారో నిరూపించుకున్నాడు రాజమౌళి. కండ్లముందు గ్రాఫిక్స్ ఈగ కదులుతున్నా.. దానిలోనూ హీరో భావోద్వేగాలు కనిపించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. విలన్‌ను తుదముట్టించడానికి కథానాయిక సాయంతో ఈగ చేసే ప్రయత్నాలు థ్రిల్‌ను పంచాయి. అందుకే యాక్షన్ సినిమాల్లో అరుదైన సినిమాగా ‘ఈగ’కూ అవకాశం దక్కింది.
ఇప్పటికీ అదే క్రేజ్
నాగార్జున కథానాయకుడిగా 1989లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ ఓ సంచలనం. అప్పటివరకూ హీరోయిజం అంటే ఓ విపరీతం. వందలమది విలన్లు మీదపడ్డా ఒంటి చేత్తో మట్టికరిపించాల్సిందే! పిడికిలి బిగించి కొడితే.. విలన్ పాతాళానికి దిగిపోవాల్సిందే!! ఆర్జీవీ ‘శివ’ ఈ తరహా హీరో కాదు. సైలెంట్‌గా ఉంటాడు. మొహమాటంగా నవ్వుతాడు. కంటి చూపుతోనే బదులిస్తాడు. అప్రయత్నంగా సైకిల్ చెయిన్ లాగి.. యథాలాపంగా చేతికి చుట్టి.. విలక్షణంగా విలన్‌కు ఒక్క కిక్ ఇచ్చాడు. విలన్ గాల్లో తేలిపోతూ ఎగిరిపడలేదు. బొంగరంలా గిర్రున తిరిగి పడలేదు. ఉన్నచోటే.. ‘అబ్బా..’ అని నొప్పి అనుభవిస్తూ కూలిపోయాడు. దటీజ్ రియల్ హీరోయిజం అని నమ్మడానికి ప్రేక్షకులకూ కొన్ని రోజులు పట్టింది. మొదటి ఆట ముగిశాక ‘ఇదేం సినిమా రా బాబూ!’ అని భావించిన ప్రేక్షకులే ఎక్కువ. పొడిపొడి మాటలు చెవికెక్కక కిక్కు మిస్సయిందని భావించారు. వారం తిరిగే సరికి నాలుగు ఆటలూ హౌజ్‌ఫుల్. చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూశారు. సైలెంట్ ఎంత వైలెంట్‌గా ఉంటుందో అనుభవించారు. పరిమితమైన మాటల్నే అయినా మనసారా ఆస్వాదించారు. ఆర్జీవీ మార్క్ డైరెక్షన్‌కు సాహో అన్నారు. ఇళయరాజా బాణీలతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయానికి కలిసొచ్చింది. నాగార్జున సైలెంట్ హీరోయిజం, రఘువరన్ విలనిజం, కాలేజీ కమ్ సిటీ బేస్డ్ రౌడీ ఇజం మొత్తంగా రామూ ఇజానికి నాంది అప్పుడే మొదలైంది. మొదటి సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు ఆరీవీ. అప్పట్లో రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన ‘శివ’ అంటే ఇప్పటికీ క్రేజ్! అందుకే యాక్షన్ జానర్లో బెస్ట్ చిత్రంగా నిలిచింది.
కథ ఒకటి.. హిట్లు రెండు!
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘బాహుబలి’. ఒకే కథను రెండు భాగాలుగా నిర్మించి దర్శకుడిగా తన స్థాయిని ఆకాశమెత్తు పెంచుకున్నాడు రాజమౌళి. కథలో ట్విస్ట్‌లు, కథనంలో వేగం ఈ దర్శకుడి ప్రత్యేకత. పాత్రోచిత నటుల ఎంపిక మరో బలం. మొదటి భాగంలో అమరేంద్ర బాహుబలి, శివుడు (మహేంద్ర బాహుబలి) పాత్రల్లో కనిపించిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. భల్లాలదేవుడిగా రానా చూపించిన క్రూరత్వం అతనిలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో ఇండస్ట్రీకి పరిచయం చేసింది. శివగామిగా రమ్యకృష్ణ అభినయం మరో పాతికేండ్లు గుర్తుండిపోతుంది. సీనియర్ నటుడు సత్యరాజ్ పేరు కట్టప్పగా స్థిరపడింది. ఇలా ఇన్నేసి పాత్రలతో పక్కాగా వండి వడ్డించిన పసందైన కదంబం బాహుబలి. పోరాట సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు జక్కన్న ఊహాశక్తికి సలామ్ కొట్టిస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఒక ఎలివేషన్ సీన్ ‘ద బిగినింగ్’ నుంచి ‘కన్‌క్లూజన్’ వరకు ఏకబిగిన చూసేలా చేస్తుంది. థియేటర్లలో రెండేండ్ల గ్యాప్‌తో విడుదలైనా.. టెలివిజన్‌లో చాలాసార్లు ఒకదాని తర్వాత మరొకటి ప్రసారమవుతూ మంచి టీఆర్పీని సాధిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర బాహుబలి సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రికార్డులన్నీ కొత్త మార్కును చేరుకున్నాయి. దేశదేశాల్లోనూ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న బాహుబలి జంట చిత్రాలకు.. టాప్ యాక్షన్ చిత్రాల్లో చోటు లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ, దొరికితే కాదు!
ఊహాతీత విక్టరీ
ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు ఊహాలోకంలో ఊరేగించే పల్లకీ సినిమా! ఆ ఊహల్లోనూ రెగ్యులర్ ఊసులు ఎందుకు అనుకున్న దర్శకులు ఫాంటసీ కథలు ఎంచుకుంటారు. సోషియో ఫాంటసీ, హిస్టారికల్ ఫాంటసీ ఇలా వారివారి ఊహాత్మక వైచిత్రిని చిత్రిక పట్టి మరపురాని చిత్రంగా మలుస్తారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ తరహా సినిమానే! కాల్పనిక పాత్రలనే కాదు చారిత్రక వీరులనూ తన ఊహా ప్రపంచంలోకి లాక్కెళ్లి అద్భుతాన్ని ఆవిష్కరించాడు జక్కన్న. కుమ్రం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనబరచిన నటన.. విడుదలకు ముందే సినిమాను విశేషంగా నిలబెట్టింది. సినిమా అంతా ఒకెత్తు అయితే యాక్షన్ సీక్వెన్స్ ఆకాశమెత్తు. ఊహాశక్తికి ఎల్లలు లేవని నిరూపించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎల్లలు దాటి విజయం సాధించింది. వసూళ్లలోనూ దూసుకుపోయింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. టాప్ యాభై యాక్షన్ సినిమాల్లోనూ నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకొని మేటి చిత్రంగా నిలిచింది.
లైగర్కూ చోటు
ఈ జాబితాలోనే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’కూ చోటు దక్కింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా మాత్రం అభిమానులకు గుర్తుండి
పోతుందని సర్వే సారాంశం.