The 100 Movie | మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్ (Rk Sagar) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది 100’(The 100 Movie). ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించగా.. ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అభిమానుల కోసం పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించారు మేకర్స్. అయితే ఈ ప్రీమియర్లతోనే మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రివ్యూ అనేది చూసుకుంటే.!
కథ
నగరంలో వరుస రాబరీ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారతాయి. ఈ క్లిష్ట సమయంలో, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విక్రాంత్ (RK సాగర్) ఏసీపీగా బాధ్యతలు స్వీకరిస్తాడు. అతని మొదటి కేసే ఈ హత్యల మిస్టరీ. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే, విక్రాంత్ ప్రేమించిన ఆర్తి (మిషా నారంగ్) కూడా అదే రాబరీ గ్యాంగ్ చేతిలో అత్యాచారానికి గురవుతుంది. దీంతో విక్రాంత్ ఈ కేసును మరింత లోతుగా పరిశోధించడం ప్రారంభిస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ హత్యలు ఒడిశా నుంచి వచ్చిన గ్యాంగ్ చేస్తున్నట్లు తెలుసుకుని, వారిని పట్టుకుని విచారిస్తాడు. ఆ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడతాయి. అయితే విక్రాంత్ పట్టుకున్న గ్యాంగ్‌కు, హీరోయిన్‌పై జరిగిన అత్యాచారానికి సంబంధం లేదని తేలుతుంది. మరి ఆర్తిపై అత్యాచారానికి పాల్పడింది ఎవరు? ఈ సినిమాలో విష్ణుప్రియ పాత్ర ఏమిటి? చివరికి విక్రాంత్ అసలైన గ్యాంగ్‌ను పట్టుకోగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ‘ది 100’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ కథలకు స్క్రీన్‌ప్లేనే ప్రాణం. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను థ్రిల్ చేయాలి, తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని పెంచాలి. ‘ది 100’ విషయంలో దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఇందులో పూర్తిగా విజయం సాధించాడని చెప్పొచ్చు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా కథ, దర్శకత్వం అద్భుతంగా కుదిరాయి. దర్శకుడు అన్ని పాత్రలను చాలా చక్కగా రాసి, డిజైన్ చేశారు. ఈ సినిమా ఒక భావోద్వేగాల సమ్మేళనంలా అనిపిస్తుంది. డ్రామా, ఎమోషన్స్, థ్రిల్ వంటి వాణిజ్య అంశాలను కూడా చక్కగా జోడించి, రాఘవ్ ఓ ఆసక్తికరమైన సినిమాను అందించారు. ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్నాయి. వర్షంలో తెరకెక్కిన క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
నటీనటులు
RK సాగర్ విక్రాంత్ ఐపీఎస్ అధికారి పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర సాగర్‌కు చాలా సులువుగా అనిపించింది. ‘మొగలి రేకులు’ టీవీ సీరియల్లో RK నాయుడుగా పోలీస్ పాత్రలో ఎంతటి ప్రభావాన్ని చూపించారో, విక్రాంత్ పాత్ర దానికి ఒక అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లా ఉంది. ఆయన నటన ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. సాగర్‌తో పాటు మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, లక్ష్మీ గోపాలస్వామి, కళ్యాణి నటరాజన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. చాలా సన్నివేశాలను BGM మరింత ఎలివేట్ చేసింది. ఎడిటింగ్‌కు మాత్రం ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది అనిపించింది. మొత్తం మీద, ‘ది 100’ ఒక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఇది తప్పకుండా ఆకట్టుకుంటుంది.