Thangalaan Movie | ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ హిట్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
కొన్ని దశాబ్దాల క్రితం కోలార్ గోల్డ్ మైన్స్ (కేజీఎఫ్)లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ లోకల్ ట్రైబల్ చీఫ్ పాత్రలో నటిస్తున్నాడు. గోల్డ్ మైన్స్ సమీపంలోని గ్రామ ప్రజలకు, ఆంగ్లేయులకు మధ్య యుద్ధ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. టీజర్లో విక్రమ్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఒక వైపు కత్తి పట్టుకొని అందరిని నరికేస్తూ.. మరోవైపు పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు చూపించారు. ‘తంగలాన్’ టీజర్ గమనిస్తే.. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అని తెలుస్తుంది. విక్రమ్ లుక్, టీజర్ విజువల్స్, నేపథ్య సంగీతం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఒక్క డైలాగ్ కూడా లేని ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమా విడుదల కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్లో విక్రమ్ ఒక షాకింగ్ న్యూస్ పంచుకున్నాడు. ఈ మూవీలో తన రోల్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు డైలాగులు లేవు. ‘శివపుత్రుడు’ సినిమాలో ఎలా ఉంటానో ఈ సినిమాలో కూడా అలానే ఉంటాను అంటూ విక్రమ్ కుండ బద్దలు కొట్టాడు. ఇక ఈ మాటతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. డైలాగ్‌లు లేకుండా విక్రమ్‌తో పా రంజిత్ (Pa Ranjith) ఏం ప్లాన్ చేశాడని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.