Vaarasudu Movie Run Time | దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పేరుకు డబ్బింగ్ సినిమానే అయినా.. తెలుగు స్ట్రేయిట్ సినిమా రేంజ్లో థియేటర్లలో సందడి చేయడానికి ఈ సినిమా ముస్తాబవుతుంది. అయితే మొన్నటి వరకు ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. పైగా తెలుగులో ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఇటీవలే రిలీజైన ట్రైలర్ మాత్రం కాస్త బజ్ క్రియేట్ చేసింది. రొటీన్ ప్లాట్‌తోనే వస్తున్నా.. కథనం కొత్తగా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా యాక్షన్ కూడా పుష్కలంగా ఉండనున్నట్లు అర్థమవుతుంది.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వారసుడు సినిమా సంక్రాంతికి సందడి చేయబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్‌టైమ్ 2 గంటల 50 నిమిషాలు ఉండనుంది. ‘అవతార్’ కాకుండా ఇటీవల కాలంలో ఇంత లెంగ్తీ రన్ టైంతో వచ్చిన సినిమా లేదు. నిజానికి ఒక ఫ్యామిలీ కథకు ఇంత రన్‌టైమ్ చాలా ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలు రావడమే చాలా వరకు తగ్గిపోయాయి. సరైన కథ, స్క్రీన్ ప్లే, అబ్బురపరిచే సన్నివేశాలు వంటివి ఉన్నప్పుడు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టగలరు. లేదంటే మొదటి రోజే ముసుగు తన్నేస్తాయి.
గతేడాది ప్రథమార్థంలో రిలీజైన ‘అంటే సుందరానికీ’ మూవీ పరిస్థితి కూడా అంతే. కథ, కథనం బాగానే ఉన్నా సినిమా రన్‌టైమ్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు డిజాస్టర్ చేశారు. ఇక ఇటీవలే రిలీజైన ‘అవతార్’ విషయంలో ఇదే జరిగింది. లెంగ్తీ రన్‌టైమ్ కారణంగా మొదటి రోజునే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంతటి విజువల్ వండర్కే మిక్స్డ్ టాక్ వస్తే, వారసుడు సినిమా పరిస్థితేంటి అని విజయ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం దిల్‌రాజు సినిమా కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని ధీమాగా ఉన్నారు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, నిర్మిస్తున్నారు. ద్విభాషా సినిమాగా రూపొందిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.