పొరుగు హీరోలను ఆదరించడంలో తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. అలా మన మనసులు దోచుకున్న హీరోల్లో ఒకరు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తక్కువ కాలంలోనే తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ‘మహానటి’, ‘కనులు కనులను దోచాయంటే’, ‘సీతారామం’ ఇలా వరుస హిట్లతో టాలీవుడ్‌లోనూ పాగా వేసిన ఈ విలక్షణ నటుడి తాజా వెబ్ సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ ఈ నెల 18న ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా దుల్కర్పంచుకున్న అనుభవాలు ఇవి..
ఒకసారి కథ ఓకే చేసిన తర్వాత మళ్లీ మార్పులు చేయమని అడగను. నన్ను ఎలా చూపించాలో దర్శకుడికి తెలుసు. కథకు తగ్గట్టుగా పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండాలో వాళ్లకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఒక నటుడిగా దర్శకుడు చెప్పినట్టు చేయడమే నా పని. ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్‌సిరీస్ విషయంలోనూ అదే పాటించాను. పైగా, ఆ పాత్రకోసం నేనేం ప్రత్యేకంగా కసరత్తులు చేయలేదు. సెట్స్‌లో దర్శకుడు చెప్పింది ఆకళింపు చేసుకొని, ఆయన చెప్పినట్టుగా ఎగ్జిక్యూట్ చేశా.
ఈ వెబ్‌సిరీస్ 90వ దశకాన్ని మళ్లీ గుర్తుచేస్తుంది. నలభైకి చేరువలో ఉన్నవాళ్లలో చాలామంది ఆ దశాబ్దాన్ని మరపురాని కాలంగా భావిస్తారు. నాక్కూడా 90లలో ఎన్నో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయి. కథాకాలాన్ని బట్టి ఈ వెబ్‌సిరీస్‌లో వస్త్ర ధారణ, వాహనాలు, లొకేషన్లు, మనుషుల అభిరుచులు.. ఇలా అన్నిట్లోనూ అప్పటి రోజులను చూపించే ప్రయత్నం చేశాం.
సెల్ఫోన్లు లేని 90వ దశకంలో మనసుకు చాలా ప్రశాంతంగా ఉండేది. ‘90లలోని మీకు నచ్చింది ఏం తెచ్చుకుంటారు?’ అని ఎవరైనా అడిగితే డ్రెస్సింగ్ సెన్స్ అని చెబుతాను. నేటి ఫ్యాషన్ ప్రపంచం పాతకొత్తల కలయిక అనుకోండి. అప్పటి ఫ్యాషన్స్నే కాస్త మార్చి నయా ట్రెండ్‌గా పరిచయం చేస్తున్నారు. ఇక ఈ వెబ్‌సిరీస్‌లో ఉపయోగించిన వింటేజ్ కార్లు ఏ తరానికైనా నచ్చుతాయి.
ఓటీటీ కారణంగా నటులకు పాన్ ఇండియా గుర్తింపు లభిస్తున్నది. అంతేకాదు, మంచి మంచి కథలకు ఓటీటీ వేదిక అవుతున్నది. ఎక్కడెక్కడి నిపుణులంతా ఒక్కచోట చేరి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన వారంతా ‘గన్స్ అండ్ గులాబ్స్’లో పనిచేశారు. నాది కేరళ, మరో నటుడు దేవయ్యది కర్ణాటక, భానుది ఛత్తీస్‌గఢ్. ఇలా ప్రతి విభాగంలోనూ నాలుగైదు రాష్ర్టాలకు చెందినవారు కనిపిస్తారు.
ప్రతి నటుణ్ని ‘మీ డ్రీమ్ రోల్ ఏంటి?’ అని అడుగుతారు. నాకు అలాంటి ప్రత్యేకమైన కలలేం లేవు. ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు పోషించాలి అనుకుంటా. ఇప్పుడు వస్తున్న దర్శకులు, కథా రచయితలు మనం కలలో కూడా ఊహించని పాత్రలను సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు డ్రీమ్ రోల్ గురించి ఆలోచించడం ఎందుకు? ఉదాహరణకు ‘చుప్’ సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్ర చేశాను. అలాంటి రోల్ నా దగ్గరికి వస్తుందనీ, చేస్తాననీ ఎన్నడూ ఊహించలేదు. మంచిపాత్ర వస్తే చేయడం ఒకటే నాకు తెలుసు.