హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న యువతరం సినిమా ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా ఈ సినిమాలోని తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘చిలకా..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, విజయ్ బుల్గానిన్ స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. స్కూల్ వాతావరణంలో హీరోహీరోయిన్ల తొలిప్రేమ జ్ఞాపకాలను ఈ పాటలో చూడొచ్చు. స్కూల్డేస్లోని స్వచ్ఛమైన ప్రేమకు చెందిన అందమైన క్షణాలను దర్శకుడు హృద్యంగా తెరకెక్కించారని చిత్రబృందం చెబుతున్నది. ఈ చిత్రానికి కథ, మాటలు: నందు సవిరిగాన, కెమెరా: కేవీ గుహన్, నిర్మాణం: అరుణాచల క్రియేషన్స్.