SIIMA-2023 Awards | శుక్రవారం రాత్రి జరిగిన సైమా-2023 వేడుకలకు దక్షిణాది తారా తోరణం అంతా ఒకటైంది. తెలుగు, కన్నడ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు అవార్డు ఫంక్షన్లో సందడి చేశారు. ఈ వేడుకకు దుబాయ్ వేదికైంది. ఇక ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికవుతారనే సస్పెన్స్‌కు తెర దించుతు తారక్ పేరును ప్రకటించారు. ఆర్ఆర్ఆర్లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్కు ఈ అవార్డు వరించింది. ఇక అవార్డు గెలుచుకున్న ఎన్టీఆర్ తన స్పీచ్‌తో అభిమానులు హృదయాలను ఉద్వేగానికి గురిచేశాడు.
నా ఒడుదొడుకుల్లో అభిమానులు నాకు ప్రతినిత్యం తోడుగా, అండగా ఉన్నారు. కిందపడ్డ ప్రతీసారి తోడుగా నిలిచి, నన్ను పట్టుకుని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. నా కంటి నుంచి వచ్చిన ప్రతి బొట్టుకు వాళ్లూ బాధపడ్డారు. నా సంతోషంలో పాలు పంచుకున్నారు. నన్ను అభిమానించే వారందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో కొమురం భీమ్ లాంటి అద్భుతమైన పాత్రను అప్పగించినందుకు రాజమౌళికి ధన్యవాదాలు అంటూ స్పీచ్ ఇచ్చాడు. తారక్ స్పీచ్‌కు ఆడిటోరియం మొత్తం హర్ష ధ్వానాలతో మార్మోగిపోయింది.
ఇక ధమాకా సినిమాకు గానూ శ్రీలీల ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఉత్తమ చిత్రంగా సీతారామం, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డులు గెలుచుకున్నారు. ఇక రెండు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలో.. శనివారం తమిళ, మలయాళ భాషలకు సంబంధించిన అవార్డులు ప్రధానం చేయనున్నారు.