‘ప్రజెంట్ జనరేషన్లో పళ్లైన కొత్త జంటలు పిల్లల్ని కనడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు.? వారి ఆలోచనల్లో ఆ మార్పుకు కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘జనక అయితే గనక’. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్లు వేసి చాలామందికి చూపించాం. అన్ని వయసుల వారూ ఈ సినిమా చూశారు. అందరూ మెచ్చుకున్నారు’ అని దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల అన్నారు. ఆయన దర్శకత్వంలో సుహాస్, సంగీర్తన జంటగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి హర్షిత్‌రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. శిరీష్ సమర్పకుడు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల ముచ్చటించారు. ‘ఈ కథ ఐడియా ఎప్పట్నుంచో ఉంది. ఓ వ్యక్తి కండోమ్ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. కాకపోతే ఎలా డ్రైవ్ చేయాలో తెలీలేదు. ఈ క్రమంలో నా కుటుంబాన్నే అబ్జర్వ్ చేశా. ఏదో ఒక సందర్భంలో పెళ్లి, పిల్లల డిస్కషన్ ఉండకుండా ఉండేదికాదు. ఇదొక యూనివర్సల్ ఎమోషన్ అని అర్థమై, దీన్నే నా ఆలోచనలకు ముడిపెట్టి కథరాశా. ఈ కథను చాలామందికి చెప్పాను. చివరకు దిల్‌రాజుగారి చెవిన పడింది. ఆయనకి నచ్చడం వల్లే ఇప్పుడీ సినిమా మీ ముందుకొస్తున్నది’ అంటూ చెప్పుకొచ్చారు సందీప్‌రెడ్డి బండ్ల. సుహాస్ చాలా గొప్పగా నటించాడని, సంగీర్తన పాత్రకు ప్రశంసలు ఖాయమని, ఇది అడల్డ్ థీమ్ ఉన్న సినిమా కాదని, అందరూ చూసే సినిమా అనీ, కొత్త కథల్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పక ఆదరిస్తారని సందీప్‌రెడ్డి బండ్ల నమ్మకం వెలిబుచ్చారు.