Suriya- Chandoo Mundeti Movie | దత్త పుత్రుడిగా హీరో సూర్యను తెలుగు ప్రేక్షకులు పిలుచుకుంటుంటారు. కమల్, రజనీ తర్వాత టాలీవుడ్లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న తమిళ నటుడు సూర్య అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఆయన సినిమాలను ఇక్కడి ప్రేక్షకుల ఏ రేంజ్లో ఆదరిస్తారో ఇటీవలే రీ-రిలీజైన సూర్య సన్నాఫ్ కృష్ణన్ యుఫోరియా చూస్తే క్లారిటీ వస్తుంది. ఒక తెలుగు స్టార్ హీరో సినిమా రీ-రిలీజైతే ఏ స్థాయిలో సెలబ్రేషన్స్ జరుగుతాయో.. మొన్న రిలీజైన ఈ సినిమాకు కూడా అదే రేంజ్లో సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి సూర్య సైతం ఆశ్చర్యపోయాడంటే మనోళ్లు ఆయన్ను ఎంతగా అభిమానిస్తున్నారో పర్టిక్యులర్‌గా చెప్పే అవసరం లేదు.
ఇక సూర్య సైతం ఎప్పటి నుంచో తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఆశపడుతున్నాడు. ఏళ్లు గడుస్తున్నాయి కానీ.. సూర్యతో ఏ దర్శకుడు కనెక్ట్ కాలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు కార్తికేయ సిరీస్ దర్శకుడు చందూ ముండేటి దర్శకుడు చెప్పిన లైన్‌కు సూర్య బాగా ఇంప్రెస్ అయ్యాడని, క్రమం తప్పుకుండా స్క్రిప్ట్ గురించి తెలుసుకుంటున్నాడి చందూనే చెప్పడం విశేషం. ఆల్మోస్ట్ వీళ్ల కాంబో సెట్టయిపోయింది. ఈ సినిమా నాలుగు వేదాలైన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వన వేదాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ రాసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
గీతాఆర్ట్స్ సంస్థ ఈ సినిమా రూపొందించనున్నట్లు ఎప్పటి నుంచో వస్తున్న వార్తలే. అయితే ఈ కాంబో సెట్ మీదకు వెళ్లడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేటట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం సూర్య కంగువా, వడివసాల్తో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక చందూ ముండేటి సైతం ప్రస్తుతం నాగచైతన్యతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే కార్తికేయ-3ను స్టార్ట్ చేయనున్నాడు. ఈ లెక్కను చూసుకుంటే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి మరో రెండేళ్లు సమయం పట్టేటట్లు కనిపిస్తుంది. అల్లు అరవింద్ ఏదైనా మేజిక్ చేసి వచ్చే ఏడాది సినిమాను ప్రారంభించిన ఆశ్చర్యపోనక్కర్లేదు.