సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సురాపానం’. ‘కిక్ అండ్ ఫన్’ అనేది శీర్షిక. పగ్యా నయన్ నాయికగా నటిస్తున్నది. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘తెలంగాణ ప్రాంత నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమిది. ఊహాశక్తితో మనం ఎంత మంచి కథనైనా కల్పన చేయవచ్చు. ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఊహ ఆధారంగా రూపొందించారు. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి వంటి అంశాలతో పాటు మంచి ప్రేమకథను ఇందులో చూస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫిలిం మేకింగ్‌లో ఇక్కడి యువ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాం. దర్శకుడు సంపత్ కుమార్ అందులో ఒకరు’ అన్నారు. ‘ఇవాళ కంటెంట్ పరంగా చాలా పోటీ నెలకొంది. ఎన్నో తరహాల సినిమాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి జానర్ సినిమా రాలేదని చెప్పగలను. కంటెంట్ పరంగా ఇది పెద్ద చిత్రమే’ అని దర్శకుడు సంపత్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక ప్రగ్యా నయన్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.