Rajpal Yadav | చెక్కు బౌన్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఆయన చేసిన అభ్యర్థనను మన్నించిన ధర్మాసనం.. కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే సమర్పించిన రూ. 1.15 కోట్లు కాకుండా, మిగిలిన రూ. 85 లక్షలను అక్టోబర్ 13వ తేదీలోగా కచ్చితంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు ఊరటనిస్తూ గడువును పొడిగించింది. కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా.. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాజ్‌పాల్ యాదవ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. “మీ ప్రవర్తన ఇంకా మాకు సంతృప్తికరంగా లేదు. మీ తప్పునకు నిజానికి మిమ్మల్ని ఇప్పుడే జైల్లో పెట్టాలి. కానీ, మీరు రూ. 1.15 కోట్లు తెచ్చినందుకే మేము కాస్త సమయం ఇస్తున్నాం” అని కోర్టు స్పష్టం చేసింది. మిగిలిన రూ. 85 లక్షలు చెల్లించిన తర్వాతే ఆయన అప్పీల్ పిటిషన్‌ను విచారిస్తామని తేల్చిచెప్పింది.
ఈ సందర్భంగా రాజ్‌పాల్ యాదవ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాము విక్రయించాలనుకున్న ఆస్తి అమ్మకం కొన్ని కారణాల వల్ల పూర్తి కాలేదని, అందుకే మిగతా డబ్బును సమకూర్చలేకపోయినట్లు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో ఆ భూమిని కొనుగోలు చేస్తున్న వ్యక్తి కూడా స్వయంగా కోర్టుకు హాజరై, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా రూ. 85 లక్షలు త్వరలోనే బదిలీ చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2010లో ఒక సినిమా నిర్మాణం కోసం రాజ్‌పాల్ యాదవ్ ‘ముర్లీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్’ సంస్థ నుంచి భారీగా రుణం తీసుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు నటుడికి శిక్ష విధించగా, దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయన ఇప్పటికే ఆరు నెలలకు పైగా జైలు శిక్ష కూడా అనుభవించారు. విచారణ సమయంలో రాజ్‌పాల్ యాదవ్ తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. ఈ సినిమా వివాదం కారణంగా తనకు సుమారు రూ. 22 కోట్ల నష్టం వాటిల్లిందని, జైలు శిక్షతో తన పరువు ప్రతిష్టలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ఇకపై మంచి సినిమాలు తీసి ప్రజలను నవ్విస్తే, మీ పరువు దానంతట అదే మళ్లీ వస్తుందని ధైర్యం చెప్పారు. మిగిలిన మొత్తం చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేస్తామని పేర్కొన్న సుప్రీంకోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.