Renuka Swamy | గతేడాది కర్ణాటకకు చెందిన రేణుకా స్వామి అనే యువకుడు అత్యంత దారుణంగా హత్యకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ అరెస్ట్ అయ్యి ఇటీవల హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద బయటికి వచ్చాడు. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును బెంగళూరు నగర పోలీసులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా.. దీనిని విచారించిన సుప్రీం హైకోర్ట్ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తీరు న్యాయబద్ధంగా లేదని తెలిపింది.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కర్ణాటక హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము ఏకీభవించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే బెయిల్ మంజూరు విషయంలో తామెందుకు జోక్యం చేసుకోకూడదో చెప్పాలని దర్శన్ తరపు న్యాయవాదిని సుప్రీం ప్రశ్నించింది. అనంతరం ఈ కేసు విచారణను జూలై 22కి వాయిదా వేసింది. ఈ పరిణామాలతో దర్శన్ బెయిల్ రద్దు అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.