ప్రయోగాల సాహసి
తెలుగు చిత్రసీమలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు సూపర్‌స్టార్ కృష్ణ. ప్రయోగాలకు పెద్దపీట వేశారు. సాంకేతికంగా పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించారు. కృష్ణ సాధించిన ఘనతల్లో కొన్ని..
బహుముఖ ప్రజ్ఞాశాలి
నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకత్వం, పంపిణీరంగం, స్టూడియో సెక్టార్…ఇలా పలు విభాగాల్లో ప్రతిభ చూపించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ. 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో ‘శంఖారావం’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాల చంద్రుడు’ వంటి ఘన విజయాలున్నాయి. తన సతీమణి విజయ నిర్మలతో కలిసి 48 చిత్రాల్లో హీరోగా నటించారు. తర్వాత అత్యధికంగా జయప్రదతో 47 చిత్రాలు చేశారు. కృష్ణ కెరీర్లో మైలురాయిగా చెప్పుకునే ‘అల్లూరి సీతారామరాజు’ చిత్ర రూపకల్పనలోనూ దర్శకుడి బాధ్యతలు తీసుకున్నారు కృష్ణ. ఈ చిత్ర దర్శకుడు వీ రామచంద్రరావు చిత్రీకరణ మధ్యలోనే కన్నుమూశారు. దీంతో కృష్ణ మిగిలిన సినిమాను తన సారథ్యంలోనే పూర్తి చేశారు.
నిత్య ప్రయోగాల సహవాసి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం సూపర్‌స్టార్ కృష్ణ. సాధించాలంటే సాహసించాలి అనే సూత్రాన్ని జీవితాంతం విశ్వసించారాయన. తెలుగు సినిమా స్వర్ణయుగపు కాలంలోనే హేమాహేమీలను సవాలు చేసి సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తనకాలం కంటే ముందుగా ఆలోచిస్తూ తెలుగు సినిమాలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి సాంకేతికంగా కొత్తపుంతలు తొక్కించారు. పౌరాణిక సినిమాలు రాజ్యమేలుతున్న తరుణంలో హాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన గూఢచారి కథల్ని తెలుగువారికి పరిచయం చేశారు. మూడు షిఫ్ట్స్‌లో పనిచేస్తూ పరిశ్రమ అభివృద్ధికి నిరంతరం శ్రమించారు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా, సాహసమే ఊపిరిగా తెలుగు సినిమా సూపర్‌స్టార్‌గా ఐదు దశాబ్దాల కృష్ణ నట ప్రస్థానం అనితరసాధ్యం. ఇక వ్యక్తిగతంగా అజాతశత్రువుగా, సహృదయుడిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మహాభినిష్క్రమణతో తెలుగు సినిమా చరిత్రలో ఓ శకం ముగిసింది. ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో 1943 మే 31వ తేదీన ఘట్టమనేని రాఘవయ్యచౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు కృష్ణ. ఆయన అసలు పేరు శివరామకృష్ణమూర్తి. ఐదుగురు సంతానంలో ఆయనే పెద్దవాడు. తెనాలి తాలూకా హైస్కూల్లో పదోతరగతి వరకు విద్యనభ్యసించిన అనంతరం ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనంలో చూసిన ‘పాతాళభైరవి’ సినిమా ఆయన మనసుపై చెరగని ముద్రవేసింది. ఏలూరు కళాశాలలో చదువుకుంటున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు 60 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అభిమానుల కోలాహలం, అక్కినేనికి జరిగిన సన్మాన వైభవాన్ని చూసిన కృష్ణకు నటుడు అంటే ప్రజలకు ఎంత ఆరాధనో అర్థమైంది. ఆ సంఘటనతో కృష్ణ మదిలో వెండితెరపై వెలిగిపోవాలనే కోరికకు అంకురార్పణ జరిగింది. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఇంజనీరింగ్‌లో సీటు రాకపోవడంతో ఇక సినిమాలే తన జీవితమని నిర్ణయించుకున్నారు. సొంత ఊరు తెనాలికి చెందిన నటుడు జగ్గయ్య, నిర్మాత చక్రపాణి తన తండ్రికి పరిచయస్తులు కావడంతో వారి మీద భరోసాతో మద్రాస్ నగరంలో అడుగుపెట్టారు.
‘తేనె మనసులు’తో వరించిన అదృష్టం
అక్కినేని నాగేశ్వరరావు ‘మూగ మనసులు’ అపూర్వ విజయాన్ని దక్కించుకోవడంతో చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు పేరు పరిశ్రమలో మార్మోగిపోతున్న రోజులవి. అదే సమయంలో అందరూ నూతననటీనటులతో తన తదుపరి చిత్రం ‘తేనె మనసులు’ కోసం పత్రికా ప్రకటన ఇచ్చారు ఆదుర్తి సుబ్బారావు. ఆ ప్రకటన చూసి ఫొటోలు పంపించిన కృష్ణకు వారం రోజుల్లోనే మద్రాస్ రమ్మని పిలుపొచ్చింది. అప్పటికే కృష్ణకు వివాహమై పెద్ద కుమారుడు రమేష్ జన్మించాడు. భార్య, కుమారున్ని ఇంటి దగ్గరే వదిలిపెట్టి ఒంటరిగా మద్రాస్ పయనమయ్యారు కృష్ణ. ‘తేనె మనసులు’ సినిమా ఆరంభానికి ముందే తమ సంస్థలో వరుసగా రెండు సినిమాల్లో నటించాలని బాబూ మూవీస్ సంస్థ కృష్ణతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో ‘తేనె మనసులు’ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు కృష్ణ రెండు వేల పారితోషికాన్ని స్వీకరించారు. 1965 మార్చి 31న విడుదలైన ‘తేనె మనసులు’ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయం కృష్ణ ఉజ్వల సినీ కెరీర్‌కు బాటలు వేసింది.
ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా అవతరణ
‘తేనె మనసులు’ చిత్రంలో కృష్ణ నటన మెచ్చిన నిర్మా త డూండీ తాను తీయబోతున్న ‘గూఢచారి 116’లో కృష్ణకు కథానాయకుడిగా అవకాశమిచ్చారు. మల్లిఖార్జున రావు దర్శకత్వంలో 1966 ఆగస్ట్ 11న విడుదలైన ‘గూఢచారి 116’ చిత్రం సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పింది. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రమిదే కావడం విశేషం. ‘పానిక్ ఇన్ బ్యాంకాక్’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. ‘గూఢచారి 116’ అపూర్వ విజయం కృష్ణకు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ సినిమాలు మాత్రమే బీ, సీ సెంటర్లలో ఆడేవి. మూడో సినిమా ద్వారానే కృష్ణ మాస్ ప్రేక్షకుల్లో ఇమేజ్ను సంపాదించుకున్నారు. అభిమానులు ఆయన్ని ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం ఆరంభించారు. ‘గూఢచారి 116’ విజయంతో కృష్ణ తారాపథంలో దూసుకెళ్లారు. ఒకేసారి 20 సినిమాల్లో ఆయన్ని హీరోగా ఎంపిక చేసుకున్నారు.
మెరుపు వేగంతో మూడు షిఫ్టుల్లో
తెలుగు తెరపై అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా మరొకరికి సాధ్యం కాని చరిత్రను సృష్టించారు సూపర్ స్టార్ కృష్ణ. ఐదు దశాబ్దాల నట ప్రస్థానంలో దాదాపు 350 చిత్రాల్లో నటించారాయన. వీటిలో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలున్నాయి. విస్తృతమైన కెరీర్ కృష్ణది. ఏడాదికి ఆయన చేసినన్ని సినిమాలు మరే కథానాయకుడు చేయలేదు. రోజుకు మూడు షిప్టులు నటించిన హీరో కృష్ణ. ఒక ఏడాదిలో 17 చిత్రాల్లో నటించారాయన. రెండేళ్లకో సినిమాలో నటించే హీరోలున్న నేటి పరిస్థితుల్లో సంవత్సరంలో 17 చిత్రాల్లో నటించడం అత్యంత అరుదైన విషయం. ఏడాదికి కనీసం 8 నుంచి 10 చిత్రాల్లో నటించడం ఆయన వేగానికి నిదర్శనం. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసి మెప్పించిన నటుడు కృష్ణ. ఆయనను అలుపెరుగని సినీ యోధుడుగా చెప్పుకోవచ్చు. విరామం లేని ఆయన 50 ఏళ్ల నటన తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది. అందుకే కృష్ణ లేని తెలుగు సినిమాను ఊహించలేం. మన వెండితెరపై ఆయన ప్రస్థానమే ఒక సువర్ణాధ్యాయం. 2016 లో విడుదలైన ‘శ్రీశ్రీ’ సినిమా కృష్ణ నటించిన చివరి చిత్రం.
వెల్లువెత్తిన అవకాశాలు
‘గూఢచారి 116’ విజయంతో కృష్ణకు అవకాశాలు వెల్లువెత్తాయి. 60, 70దశకాల్లో ఏమాత్రం విరామం లేకుండా షూటింగ్స్‌తోనే గడిపారు. ఒక రోజులో మూడు షిప్ట్స్ చేస్తూ విరామం లేకుండా పనిచేశారు. 1972లో రికార్డు స్థాయిలో 18 సినిమాలు విడుదలయ్యాయి. 1968 జనవరిలో విడుదలైన ‘అసాధ్యుడు’ చిత్రం తర్వాత కృష్ణ సినీ జీవితం పరుగులు పెట్టింది. ఆ సినిమాలోనే ఆయన తొలిసారిగా అల్లూరి సీతారామరాజు గెటప్ వేశారు. రోజూ మూడు షిప్ట్స్‌లో పనిచేయడంతో కృష్ణకు నిద్రపోయే సమయం కూడా ఉండేది కాదు. అలసిపోయి నిద్రపోతుంటే ‘మా సినిమా డ్రెస్ వేసుకొని నిద్రపోండి. కథ ప్రకారం మీరు నిద్రపోతున్న సన్నివేశం ఉంది. మేం తీసుకొని వెళ్లిపోతాం’ అన్న సందర్భాలు ఉన్నాయని కృష్ణ చెప్పేవారు. 1967 నుంచి 70వరకు నాలుగు సంవత్సరాల్లో 48 చిత్రాల్లో నటించారు కృష్ణ. ఆ సమయంలో విజయనిర్మల కాంబినేషన్లో వచ్చిన మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్‌ప్రెస్, అత్తగారూ కొత్త కోడలు, మంచి మిత్రులు వంటి చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించడంతో కృష్ణ-విజయనిర్మల జంటకు హిట్‌పెయిర్ అనే పేరొచ్చింది.
విజయనిర్మలతో వివాహం
‘సాక్షి’ సినిమా షూటింగ్‌లోనే కృష్ణకు విజయనిర్మలతో పరిచయం ఏర్పడింది. షూటింగ్ మొత్తాన్ని రాజమండ్రి దగ్గరలోని పులిదిండిలో జరిపారు. ఆ ఊర్లోని మీసాల కృష్ణుడి గుడిలో ఓ పాటను తెరకెక్కించారు. పెళ్లి నేపథ్యంలోని ఆ పాటను శాస్ర్తోక్తంగా చిత్రీకరించారు. ఆ పాట షూటింగ్ సమయంలో నటుడు రాజబాబు..‘ఈ గుడి చాలా శక్తివంతమైనది. ఇందులో జరిగిన మీ సినిమా పెళ్లి త్వరలో నిజమవుతుంది’ అన్నారట. అయితే అక్కడున్న వారందరూ ఏదో సరదాగా అన్నారని నవ్వుకున్నారట. రాజబాబు వాక్కును నిజం చేస్తూ 1969 మార్చి 24న తిరుపతిలో కృష్ణ-విజయనిర్మల వివాహం జరిగింది.
పద్మాలయా స్టూడియోస్ స్థాపన
తన అభిరుచి మేరకు సినిమాలు తీయాలనే ఆలోచనతో 1970లో స్వీయనిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ సంస్థను స్థాపించారు కృష్ణ. ‘అగ్నిపరీక్ష’ పేరుతో తొలి సినిమా తీసి విజయాన్ని దక్కించుకోలేకపోయారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ (1971) చిత్రం పద్మాలయా సంస్థకు తొలి విజయాన్ని అందించింది. ఆ రోజుల్లో విడుదలైన మెకనాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఫ్యూ డాలర్స్ మోర్..అనే హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో కె.యస్. ఆర్.దాస్ దర్శకత్వంలో కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. కృష్ణ 60వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. హిందీ, తమిళం, ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేశారు. ఇంగ్లీష్‌లో ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో అనువదించి విడుదల చేశారు. కృష్ణ తన కెరీర్లో గూఢచారి 116, లవ్ ఇన్ ఆంధ్రా, అందరికి మొనగాడు, మాస్టర్ కిలాడీ, జేమ్స్‌బాండ్ 777, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి, గూఢచారి 117 వంటి జేమ్స్‌బాండ్ చిత్రాల్లో నటించారు. అప్పట్లోనే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని కృష్ణ చేసి జేమ్స్‌బాండ్ సినిమాలు తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడిని సృష్టించాయి.
ప్రతి జోనర్లో సినిమాలు..
ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో కృష్ణ కథాంశాల పరంగా చేయని ప్రయోగం లేదు. చిత్రసీమలో సాహసానికి మారుపేరుగా నిలిచిన కృష్ణ అన్ని జోనర్ చిత్రాల్లో నటించి తనదైన విలక్షణతను చాటుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో గూఢచారి చిత్రాలతో ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన అనంతరం విభిన్న తరహా కథాంశాల్లో నటించి మెప్పించారు. కురుక్షేత్రం (పౌరాణికం), సింహగర్జన, మహాబలుడు, ఇద్దరు మొనగాళ్లు (జానపదం), విశ్వనాథ నాయకుడు, అల్లూరి సీతారామరాజు (చారిత్రకం) వంటి చిత్రాలు కథాపరమైన వైవిధ్యాన్ని చాటిచెబుతాయి. ఇక సాంఘిక చిత్రాల్లో కూడా కథలో కొత్తదనానికి, కుటుంబ ఇతివృత్తాలకు పెద్దపీట వేశారు. పాడిపంటలు, అగ్నిపర్వతం, వజ్రాయుధం, సింహగర్జన, రక్తసంబంధం, ఇద్దరు దొంగలు, అడవి సింహాలు, కొడుకు దిద్దిన కాపురం, పాడిపంటలు, అన్నదమ్ముల సవాల్, ఏజెంట్ గోపి, మండిన గుండెలు, వియ్యాలవారి కయ్యాలు, హేమాహేమీలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు, ఈనాడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, అడవి సింహాలు, వంటి అనేక చిత్రాలు కృష్ణ కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ హీరోగా కృష్ణ పేరు తెచ్చుకున్నాడనడం అతిశయోక్తి కాదు. దర్శకుడిగా కృష్ణ తొలి చిత్రం ‘సింహాసనం’ (1984) అపూర్వ విజయాన్ని సాధించింది. అదే సినిమాను జితేంద్ర హీరోగా ‘సింఘాసన్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేశారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో తన దైన అద్భుతాభినయంతో మెప్పించారు.
మంచితనానికి మారుపేరు
తెరపై ఎంత గొప్ప నటుడో తెరవెనుక అంత గొప్ప వ్యక్తిత్వం కృష్ణది. ఆయనో అజాతశత్రువు. స్టార్డమ్ అహం లేని దిగ్గజం. ఆయనతో పరిచయమున్న ఎవరైనా చెప్పే మాటిది. మచ్చలేని వ్యక్తిత్వంతో జీవితాన్ని గడిపారు కృష్ణ. స్నేహానికి విలువనిచ్చే కృష్ణ…తనతో సినిమాలు చేసి నష్టపోయిన నిర్మాతలకు మరోసారి అవకాశం ఇచ్చేవారు. ఆ నిర్మాతల దగ్గర డబ్బు లేకుంటే ఫైనాన్షియర్లకు తనే గ్యారెంటీ ఇచ్చి సినిమాను మొదలుపెట్టించేవారు. నిర్మాత బాగుంటే హీరోలు బాగుంటారని నమ్మి, ఆచరించిన కథానాయకుడు ఆయన. అందుకే ఎవరితో వివాదం లేకుండా, ఎక్కడా మాట పడకుండా రికార్డ్ స్థాయి చిత్రాలు చేయగలిగారు. ఇండస్ట్రీ అంతా మంచితనానికి మారుపేరుగా కృష్ణను చెబుతారు. ఇలా కృష్ణ ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి.
ప్రేక్షకాభిమానమే గొప్ప పురస్కారం
తనకు అవార్డులు రాలేదనే చింత ఏరోజూ కృష్ణలో కనిపించేది కాదు. వాటి కోసం ఆయన మాట్లాడిందీ లేదు. ప్రేక్షకుల్లో చిరకాలం గుర్తుండిపోయామనే సంతృప్తి కృష్ణలో కనిపించేంది. 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు కృష్ణ. 1997లో ఫిలింఫేర్ జీవనసాఫల్య పురస్కారాన్ని అందించింది. 2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ దక్కగా, 2009లో భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను ఇచ్చి గౌరవించింది.
ఏలూరు ఎంపీగా ప్రజాసేవ
‘పాతాళభైరవి’ సినిమా చూసి ఎన్టీఆర్ అభిమాని అయ్యానని కృష్ణ తన స్వగతంలో చెప్పుకున్నారు. పరిశ్రమలోకి వచ్చాక పలు సందర్భాల్లో తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కృష్ణ విభేదించాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌తో తనకున్న గ్యాప్, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు కృష్ణ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
విప్లవాగ్ని రగిలించిన ‘అల్లూరి సీతారామరాజు’
‘అల్లూరి సీతారామరాజు’చిత్రం సూపర్‌స్టార్ కృష్ణ నట జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అల్లూరి సీతారామరాజు పేరు గుర్తుకు రాగానే కృష్ణ స్ఫురణకు వస్తారు. కృష్ణ వందో సినిమా అయిన అల్లూరి సీతారామరాజు రూపకల్పన వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. అక్కినేని, ఎన్టీఆర్, శోభన్‌బాబు వంటి హీరోలు అల్లూరి సినిమా తీయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కృష్ణ మాత్రం ఈ సినిమా కోసం సుదీర్ఘ కాలం వేచి చూశారు. చివరకు త్రిపురనేని మహారథితో స్క్రిప్ట్ తయారు చేయించి సినిమాకు శ్రీకారం చుట్టారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో 1973 డిసెంబర్ 12న ‘అల్లూరి సీతారామరాజు’ ప్రారంభమైంది. తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రమిదే. విశాఖపట్నం దగ్గర అడవుల్లో దాదాపు రెండు నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణ జరిపారు. కృష్ణ నెల రోజుల పాటు అవిశ్రాంతంగా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ చిత్రం 17 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ సైతం కృష్ణను అభినందించారు. ఈ చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు ఉత్తమ గీతంగా జాతీయ అవార్డు లభించింది.
మహేష్ అంటే ప్రాణం
తనయుడు మహేష్ బాబు అంటే కృష్ణకు ప్రాణం. వేసవి సెలవుల్లో ఊటీలో షూటింగ్స్ చేయడం కృష్ణకు అలవాటు. ఏ సినిమా దర్శకులైనా అక్కడికే వచ్చి చిత్రీకరణలు జరిపేవారు. అప్పుడు మహేష్ స్కూల్‌కు సెలవు కాబట్టి తనతో పాటు తీసుకెళ్లి, సినిమాల్లో నటింపజేసేవారు. ఇలా కృష్ణ నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘అన్న తమ్ముడు’, ‘పోరాటం’, ‘ముగ్గురు కొడుకులు’, ‘శంఖారావం’ వంటి అనేక చిత్రాల్లో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. మహేష్ నటన, డాన్సులు చూసి మురిసిపోయేవారు కృష్ణ. మహేష్ తొలి సినిమా ‘రాజకుమారుడు’ చూసి కొన్ని దశాబ్దాల పాటు తన కుమారుడు స్టార్‌గా వెలుగుతాడని సంబరపడ్డారు. మహేష్ నటించిన ప్రతి సినిమా విడుదలైన తొలి ఆట చూడటం కృష్ణకు అలవాటు. ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాలు చరిత్ర సృష్టిస్తాయని కృష్ణ చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితారను గారాబంగా చూసుకునేవారు కృష్ణ. మహేష్ కూడా తండ్రిని ఆరాధిస్తాడు. తనకు నిత్య స్ఫూర్తి నాన్నేనని పలు సందర్భాల్లో చెప్పారు. తన రియల్ హీరో నాన్న అని అంటుంటారు మహేష్.
పరిశ్రమకు తీరని లోటు
సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కృష్ణ గారి కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
-అనిల్ కూర్మాచలం, ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్
నేడు షూటింగ్స్ బంద్
నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత కృష్ణ గారి మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకు గౌరవ సూచకంగా నేడు తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించాం
– తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి
అరుదైన వ్యక్తి కృష్ణ
కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం కలబోత ఆయన వ్యక్తిత్వం. తెలుగు చిత్రపరిశ్రమ తలెత్తుకునేలా ఆనేక సాహసాలు చేశారాయన. అలాంటి గొప్ప నటుడు దేశ సినీ పరిశ్రమలోనూ అరుదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సోదరుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
-చిరంజీవి
మూడు చిత్రాల్లో నటించాం
కృష్ణతో మూడు చిత్రాల్లో కలిసి నటించాను. అవి నాకెప్పటికీ మధుర జ్ఞాపకాలు. కృష్ణ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మహేష్ ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి.
-రజనీకాంత్
నిజమైన సూపర్‌స్టార్
కృష్ణ గారి మృతి వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సూపర్‌స్టార్ అని పిలిచేందుకు అన్ని అర్హతలు గల నటుడాయన. ఆయన నిజమైన సూపర్‌స్టార్. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
-వెంకటేష్
కొత్త ఒరవడి సృష్టించారు
తన నటనతో చిత్ర పరిశ్రమలో సరికొత్త ఒరవడి సృష్టించిన కథానాయకుడు కృష్ణ గారు. ఆయనతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్న, కృష్ణ గారు కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
-బాలకృష్ణ
ఎన్నో ప్రయోగాలు చేశారు
కృష్ణగారు సాహసానికి మారుపేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణ పాత్రల్లో నటించారు. సాంకేతికంగా తెలుగు సినిమాను అభివృద్ధిపథంలో నడిపించారు. ఆయన ఘనత ఎప్పటికీ చిరస్మరణీయం.
-ఎన్టీఆర్
లెజెండ్‌ను కోల్పోయాం
భయమెరుగని కథానాయకుడు కృష్ణ. ఆయన విభిన్న తరహా చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమా కౌబాయ్ ఆయన. కృష్ణ గారితో మాట్లాడుతుంటే గంటలు గడిచిపోయేవి. ఆయన సానుకూల దృక్పథం నాలోనూ నిండేది. ఒక లెజెండ్‌ను, సూపర్‌స్టార్‌ను కోల్పోయాం
-నాగార్జున
జన్మచరితార్థం చేసుకున్నారు
ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకునే దర్శక నిర్మాతలు, నటీనటులకు కృష్ణ గారే స్ఫూర్తి. ఆయన బంగారం. ఆయన ఎంతోమంది నిర్మాతలను నిలబెట్టారు. అల్లూరి సీతారామరాజు వంటి గొప్ప సినిమాను చేసి జన్మ చరితార్థం చేసుకున్నారు. నేను ఎవరి కంటే తక్కువ కాదు ఎక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసం ఆయనలో ఉండేది.
-ఆర్ నారాయణమూర్తి
నాపై ప్రేమ చూపించారు
నెల రోజుల కిందట కృష్ణ గారిని కలిశాను. నాపై ఎంతో ప్రేమ చూపించారు. మా అమ్మా నాన్నలు కృష్ణ గారి సినిమాలను ఎక్కువగా చూసి ఆనందించేవారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోవడం బాధాకరం
-విజయ్ దేవరకొండ
సోదరుడు లాంటివాడు
కృష్ణ నాకు సోదరుడు లాంటి వాడు. ఆయన మృతి నన్నెంతో కలచివేస్తున్నది. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి
-దర్శకుడు కే విశ్వనాథ్