Stree 2 Movie | ఐదేళ్ల కిందట బాలీవుడ్లో ‘స్త్రీ’ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్గా వచ్చిన ‘భేదియా’ మూవీ డైరెక్టర్ అమర్ కౌశికే స్త్రీ సినిమాను తెరకెక్కించాడు. అంతేకాకుండా ఆయనకు ఇది తొలిసినిమా. తొలి అడుగులోనే ఆ రేంజ్ హిట్ సాధించాడంటే ఆశా మాశీ కాదు. ఇక రాజ్‌కుమర్ రావు, శ్రద్ధా కపూర్ తమ తమ పర్ఫార్మెన్స్తో అదరిగొట్టేశారంతే. కీలక పాత్రలో పంకజ్ త్రిపాటి ఓ రేంజ్లో అవుట్ పుట్ ఇచ్చాడు. మొత్తంగా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా స్త్రీ నిలిచింది.
అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ‘స్త్రీ 2’ అంటూ సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాకు కూడా అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే మూవీ నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ఈ స్వతంత్ర దినోత్సవం రోజున చందేరికి రాబోతుంది ప్రమాదం అంటూ ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. అయితే ‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఓ ఊరినంత భయపెట్టిన ‘స్త్రీ’ మరోసారి వస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. శ్రద్ధా కపూర్ మళ్లీ ఇందులో కూడా స్త్రీ పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. గత ఏడాది ‘వా.. నువ్వు కావాలయ్యా’ అంటూ ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్‌తో స్టెప్పులు వేసిన తమన్నా ఈ పాటతో మరోసారి తన డ్యాన్సుతో సందడి చేయడానికి ముస్తాబవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.