Sreeleela | టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షలతో మార్మోగుతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతుండగా, హీరో రానా దగ్గుబాటి సతీమణి మిహికా బజాజ్ చేసిన ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీలీలను తన “ఫేవరెట్ గర్ల్” అంటూ సంబోధించిన మిహికా, ఆమె వ్యక్తిత్వం, కష్టపడే తత్వం, మంచితనంపై ప్రశంసల వర్షం కురిపించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మిహికా, ఆమెను కేవలం విజయవంతమైన నటిగానే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తిగా అభివర్ణించారు.
ప్రతి రోజూ నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు స్ఫూర్తిగా నిలుస్తావు. నీ కష్టపడే తత్వం, పని పట్ల అంకితభావం అందరికీ తెలిసిన విషయమే. కానీ నీలోని దయ, కరుణ, నిస్వార్థమైన ప్రేమ నిన్ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి అంటూ మిహికా భావోద్వేగంగా రాసుకొచ్చారు. అంతేకాకుండా శ్రీలీలను అరుదైన రత్నం గా అభివర్ణిస్తూ, ఆమె లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారని పేర్కొన్నారు. శ్రీలీల ఎనర్జీ లెవెల్స్‌పై కూడా మిహికా ప్రశంసలు కురిపించారు. ఆమె నిరంతరం పనిచేసే తీరు, అలసట తెలియని ఉత్సాహం నిజంగా సూపర్ హ్యూమన్ కెపాసిటీలా ఉంటుందని అన్నారు.
మేము నిన్ను చంద్రుడి వరకు ప్రేమించి మళ్లీ తిరిగి వచ్చేంతగా ప్రేమిస్తున్నాం” అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, శ్రీలీల-మిహికాల మధ్య ఉన్న సన్నిహిత బంధంపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం శ్రీలీల సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. తన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. తెలుగులో వరుస భారీ చిత్రాలతో అలరించిన శ్రీలీల, ఇప్పుడు తమిళ చిత్రసీమలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రముఖ హీరో ధనుష్ సరసన తెరకెక్కుతున్న ‘డి55’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, ‘పరాశక్తి’ అనే మరో ప్రతిష్టాత్మక తమిళ ప్రాజెక్ట్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.