ముంబయిలోని జుహూ మురికివాడకు చెందిన యువకుడి స్ఫూర్తిదాయక ప్రయాణం ఆధారంగా తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుంది. ఎనిమిది ఆస్కార్లను గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో స్వరకర్త ఏ.ఆర్.రెహమాన్ ఆస్కార్ గెలుచుకొని భారతదేశ కీర్తిని చాటారు.
ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. హాలీవుడ్‌కు చెందిన నిర్మాణ సంస్థ బ్రిడ్జ్ 7 ఈ సీక్వెల్‌కు సంబంధించిన హక్కులను సొంతం చేసుకుంది. త్వరలో సీక్వెల్ తాలూకు ప్రీప్రొడక్షన్ వర్క్‌ను మొదలుపెట్టబోతున్నామని, కొన్ని కథలను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, అందులో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఒకటని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రంలో దేవ్ పటేల్, ఫ్రిదా పింటో, మధుర్ మిట్టర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.