రెమో, సీమరాజా, శక్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు శివ కార్తికేయన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్ డాక్టర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. కోటపాటి రాజేష్ నిర్మాత. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తీకేయన్ మీడియాతో మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో ఆర్మీ డాక్టర్‌గా నటిస్తున్నాను. ఈ డాక్టర్ చేసే ఆపరేషన్ ఏమిటి? సొంతూరుకు వచ్చి అతను ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్లో చూపించినట్లుగా హ్యుమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్ సినిమాలో వున్నాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది. తమిళంలో ఈ చిత్రాన్ని నేనే నిర్మించాను. దర్శకుడు నెల్సన్‌పై వున్న నమ్మకమే నేను నిర్మాతగా మారడానికి కారణం’ అన్నారు. త్వరలోనే తెలుగులో నేరుగా నటించే చిత్రాలు సదరు నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని, ఈ చిత్రం తనకు తెలుగులో హీరోగా మరింత గుర్తింపు తీసుకువస్తుందని శివ కార్తీకేయన్ తెలిపారు.