పోలీస్ క్యారెక్టర్లకు అందరు హీరోయిన్లు సెట్ కారు. విజయశాంతి వంటి కొందరు నాయికలు తప్ప. తాజాగా విడుదలైన ‘సింగం ఎగైన్’ చిత్రంలో దీపికా పడుకోన్ ఫస్ట్‌లుక్‌ను చూస్తే పోలీస్ పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయిందంటారు. ఆదివారం ‘సింగం ఎగైన్’లోని దీపిక ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడంతోపాటు ఆమె పాత్ర పేరును కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో దీపిక పాత్ర పేరు ‘శక్తి శెట్టి’. నవరాత్రులు మొదలయ్యాయని విడుదల చేశారేమోగానీ, ఈ లుక్‌లో దీపికా పడుకోన్ అపర కాళికలా అనిపిస్తున్నది.
శవాల కుప్పనే ఆసనంగా చేసుకొని, ఓ రౌడీ నోట్లో పిస్టల్ పెట్టి, నవ్వుతూ చంపుతున్నట్లు కనిపిస్తున్న ఆ ఫస్ట్‌లుక్‌కి విపరీతమైన అప్లాజ్ వస్తున్నది. ‘సింగం ఎగైన్’ కథానాయకుడు అజయ్ దేవ్‌గణ్, ఆ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న రణ్‌వీర్‌సింగ్ ఇద్దరూ కలిసి ‘కాప్ విశ్వంలోకి స్వాగతం’ అంటూ దీపిక ఫస్ట్‌లుక్ గురించి వ్యాఖ్యానించారు. హృతిక్ రోషన్ అయితే ప్రశంసల వర్షం కురిపించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్15న విడుదల కానుంది.