‘ ‘చిన్నా’ సినిమాను తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు ‘సిద్ధార్థ్ సినిమాలు ఎవరు చూస్తారు?’ అంటూ కొందరు హేళనగా మాట్లాడారు. ఈ రోజు చెబుతున్నాను వినండి.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే ఇక నేను ఇక్కడకు రాను. ప్రెస్మీట్లు పెట్టను’ అని భావోద్వేగానికి లోనయ్యాడు హీరో సిద్ధార్థ్. ఆయన కథానాయకుడిగా నటించి, నిర్మించిన సినిమా ‘చిన్నా’. అంజలి నాయర్, సజయన్ ముఖ్యపాత్రలు. ఎస్.యు. అరుణ్‌కుమార్ దర్శకుడు. తమిళంలో ‘చిత్త’ పేరుతో విడుదలై బాగా ఆడుతున్న ఈ సినిమాను ‘చిన్నా’గా తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడారు. ‘బాబాయి, కూతురు మధ్య ఉండే అనుబంధమే ఈ సినిమా. ఇలాంటి కథలో చేయాలనేది నా 22ఏళ్ల కల. ఇన్నాళ్లకు నెరవేరింది. నా కెరీర్లో ఇదే బెస్ట్ మూవీ. నేనింకా నటుడిగా ఎందుకు కొనసాగాలో ఈ సినిమా చెబుతుంది. తమిళంలో ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా’ అని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్ధార్థ్. మరికొన్ని విషయాలు చెబుతూ ‘మొదట అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని నాలుగు నెలల కిందటే సెన్సార్ చేశాం. ఈ సినిమాకోసం కన్నడ నేర్చుకోవటమేకాక, అక్కడి మైసూర్ స్లాంగ్‌ని ప్రాక్టీస్ చేశాను. కన్నడ వెర్షన్‌కి సొంతంగా డబ్బింగ్ చెప్పాను.
కర్ణాటక వెళ్లి ప్రెస్‌మీట్ పెడితే..‘తమిళంవాడివి ఇక్కడ నీకేం పని.. గెటవుట్’ అన్నారు. నేను కన్నడను గౌరవించాను. ఆ గౌరవంతోనే భాష నేర్చుకున్నాను. కన్నడవాడిగా వాళ్లముందుకెళ్తే వాళ్లు నన్ను అవమానించారు. వాళ్ల అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నా‘ అన్నారు సిద్ధార్థ్. ‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ఏషియన్ సునీల్గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా నా జీవితం. సినిమాపై నమ్మకం, ఇష్టం ఉంటే థియేటర్‌కెళ్లి సినిమా చూడండి. ఈ సినిమా చూశాక కూడా నచ్చకపోతే ఇక తెలుగులో కనిపించను. ఈ 22ఏళ్ల నా కెరీర్లో సిద్ధార్థ్ బయటవాడు అనే మాట తెలుగునేలపై రాలేదు. రాదనే అనుకుంటున్నా. నా పేరు సిద్ధార్థ్. నేను చిన్నా అనే సినిమా తీశాను.. మీరందరూ చూడాలి. చూస్తారు’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు సిద్ధార్థ్.