సామాజిక విషయాలే కథాంశాలుగా ఆయన చిత్రసీమను మథించాడు. భారతీయ సమాంతర సినిమా అంకురాలను సృజించాడు. ఆర్ద్రత, కళాత్మకత కలగలిపి దృశ్యకావ్యాలుగా తెరపట్టాడు. అథోజగత్ సహోదరులను అనుగ్రహించాడు. వెండితెరపై శ్వేతవిప్లవ పాలనురుగుల్ని పారించిన ఆ తెలంగాణ బిడ్డ.. బెనెగెళ్ల శ్యామ్‌రావు ఉరఫ్ శ్యామ్ బెనెగల్.
Shyam Benegal | భారతీయ సినిమా దర్శక దిగ్గజం, సమాంతర సినీ వైతాళికుడు శ్యామ్ బెనెగల్ తన 90వ ఏట కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. సమాంతర సినిమాకు ప్రాణం పోసిన ఆయన.. దానిని ప్రపంచస్థాయిలో నిలిపారు. అంకుర్‌తో మొదలై 7 దశాబ్దాలపాటు విలక్షణ సినిమాలు, డాక్యుమెంటరీలతో భారతీయ చిత్రసీమలో అజరామరంగా నిలిచిపోయారు. శ్యామ్ బెనెగల్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
1976లోబెనెగల్కు కేంద్ర ప్రభుత్వ ‘పద్మశ్రీ’ పురస్కారం లభించగా, 1991లో ఆయన ‘పద్మభూషణ్’ అందుకున్నారు. 2005లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. అలాగే కలకత్తా, గ్వాలియర్ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్స్, బి.ఎన్.రెడ్డి నేషనల్ అవార్డు, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఇలా లెక్కకు మించి పురస్కారాలు శ్యామ్ బెనెగల్‌ను వరించాయి. వెండితెరపై అద్భుతాలు సృష్టించి దేశం గర్వించదగ్గ దర్శకునిగా భాసిల్లారు శ్యామ్ బెనెగల్. తెలంగాణ గడ్డపై పుట్టి, బాలీవుడ్లో మహా దర్శకుడిగా ఎదిగి.. దేశానికే విలువకట్టలేని సంపదలా నిలిచారు. భారతీయుడిగా గెలిచారు. శ్యామ్‌బెనెగల్ (90) సోమవారం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సినిమాల ద్వారా ఎప్పుడూ జనహృదయాల్లో జీవించే ఉంటారు.
భారతదేశంలో ప్రధాన స్రవంతి సినిమా ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో సమాంతర చిత్రాల రూపకల్పనతో కొత్త ఒరవడి సృష్టించారు శ్యామ్‌బెనెగల్. సామాజిక ఇతివృత్తాలను కథా వస్తువులుగా ఎంచుకొని.. సహజత్వం, వాస్తవికతకు పెద్దపీట వేస్తూ కవితాత్మక దృక్కోణంలో వెండితెరపై అద్భుతాలను సృష్టించారు. అణగారిన వర్గాల పక్షపాతిగా సామాన్యుడి బతుకు చిత్రానికి దర్పణం పట్టారు. ‘అంకుర్’తో సమాంతర సినిమా విప్లవానికి నాంది పలికి తెలంగాణ కీర్తిని జాతీయ, అంతర్జాతీయ యవనికపై నిలిపారు. భారతీయ న్యూ సినిమా మూమెంట్‌కు వైతాళికుడిగా ఆయన్ని అభివర్ణిస్తారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో కళాఖండం. చేసినవి 24 సినిమాలే అయినా అన్నీ వెండితెర అద్భుతాలే. అందులో 16 సినిమాలు జాతీయ అవార్డులు అందుకున్నాయంటే దర్శకుడిగా ఆయన ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. శ్యామ్ బెనగల్ నిష్క్రమణంతో భారతీయ సినిమాలో మహాధ్యాయం ముగిసింది. హైదరాబాద్ అల్వాల్ నుంచి మొదలై అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా వైభవాన్ని చాటిన దర్శకస్రష్ట శ్యామ్‌బెనెగల్ జీవిత ప్రస్థానం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకం.
శ్యామ్ బెనెగల్ అసలు పేరు బెనగళ్ల శ్యామసుందరావు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ అల్వాల్‌లోని చిత్రాపూర్ సారస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బెనెగల్ తండ్రి కర్ణాటకకు చెందిన వారు. బెనెగల్‌కు చిన్నతనం నుంచి కళల పట్ల ఆసక్తి అమితం. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కళాశాలలో విద్యను అభ్యసించిన ఆయన.. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్‌కు బెనెగల్ దూరపు బంధువు.
1959లో ముంబైలోని ఓ అడ్వైర్టెజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా ఆయన కెరీర్ మొదలైంది. అదే రంగంలో క్రమంగా క్రియేటివ్ హెడ్‌గా ఎదిగారు. బెనెగల్ తొలి డాక్యుమెంటరీ ‘ఘెర్ బేతా గంగా’(1962) విమర్శకుల ప్రశంసలందుకుంది. అప్పటి నుంచి 1973 వరకూ ఆయన నిర్ధేశకత్వంలో ఎన్నో డాక్యుమెంటరీ ఫిల్మ్స్ రూపొందాయి. వాటిల్లో ‘ఏ చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్’ బెనెగల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మొత్తంగా 70కి పైగా డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలను రూపొందించారు శ్యామ్ బెనెగల్. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో అధ్యాపకుడిగా, రెండు పర్యాయాలు ఛైర్మన్‌గా కూడా పని చేశారు.
1974లో సాధూ మెహర్, అనంతనాగ్, షబానా ఆజ్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘అంకుర్’ దర్శకునిగా శ్యామ్ బెనెగల్ తొలి సినిమా. అంటరానితనం, ఆర్థిక అసమానతల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు బెనెగల్. మాటలు రాని కుమ్మరి కిష్టయ్య, అతని భార్య లక్ష్మి, ఊరి పెద్ద సూర్య.. ఈ మూడు పాత్రల చుట్టూ హృద్యంగా సాగే సినిమా ఇది.
1950లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తాను ఈ కథ రాసుకున్నట్టు బెనెగల్ పలు సందర్భాల్లో చెప్పారు. పైగా స్టూడియోల్లో కాకుండా, పూర్తిగా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.
తొలి సినిమాతోనే జాతీయ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు బెనెగల్. అంతేకాదు, ఆ సినిమాలో కథానాయకుడిగా నటించిన సాధూ మెహర్ జాతీయ ఉత్తమ నటుడిగా, కథానాయిక షబానా ఆజ్మీ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 24వ బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శించబడింది. ఈ విధంగా తొలి సినిమాకే సంచలనాలకు తెరలేపారు శ్యామ్ బెనగల్.
ఇంకా శ్యామ్‌బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన నిశాంత్, మంథన్, భూమిక చిత్రాలు ఇండియన్ టాప్ క్లాసిక్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఆయన దర్శకత్వంలో 1978లో రూపొందిన ‘కొండుర’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకం. ఎందుకంటే.. ఆ సినిమాను ఆయన తెలుగులో కూడా తీశారు. సినిమా పేరు ‘అనుగ్రహం’. అనంత్‌నాగ్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం పలు అవార్డులను అందుకోవడమే కాక, నటిగా వాణిశ్రీకి గొప్ప పేరును తెచ్చిపెట్టింది. శ్యామ్ బెనెగల్ తెలుగులో తీసిన ఏకైక సినిమా ‘అనుగ్రహం’.
అలాగే శశికపూర్ కథానాయకుడిగా 1979లో ఆయన తెరకెక్కించిన ‘జునూన్’ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని అందుకోవడంతోపాటు ఆ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. వివిధ కేటగిరీల్లో ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకుంది. ఇలా.. ఆయన 24 సినిమాలను డైరెక్ట్ చేస్తే.. వాటిలో దాదాపు 16 సినిమాలు వివిధ కేటగిరీల్లో జాతీయ అవార్డులు అందుకున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో విడుదలైన ‘ముజీబ్’ దర్శకునిగా శ్యామ్ బెనెగల్ చివరి సినిమా.
తెలంగాణ సామాజిక జీవన దర్పణం
శ్యామ్‌బెనెగల్ చిత్రాలు తెలంగాణ ప్రాంతంతో గాఢమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రాంతం తాలూకు సామాజిక జీవనం, సంఘర్షణలను తన చిత్రాల్లో మానవీయ కోణంలో ఆవిష్కరించారు శ్యామ్ బెనెగల్. ‘అంకుర్’ (1974) తెలంగాణలోని సామాజిక అసమానతలను, సామాన్యుల తిరుగుబాట్లను ఆవిష్కరించింది. ‘నిశాంత్’ (1975) తెలంగాణ గ్రామీణ ప్రజల పోరాటాలకు దర్పణంలా నిలిచింది. సుశ్మన్ (1987) పోచంపల్లి ‘ఇక్కత్’ హస్తకళ నేపథ్యంలో అక్కడి కార్మికుల కష్టనష్టాలకు అద్దపట్టింది. మండీ (1983) హైదరాబాద్‌లోని వ్యభిచార గృహాల ప్రేరణతో రాసుకున్న కథ. సంక్లిష్టమైన సామాజిక అంశాలను ఆవిష్కరిస్తుంది. వెల్డన్ అబ్బా (2009) తెలంగాణలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం. ఇక్కడి రోజువారి జీవితానికి అద్దంపట్టింది. తెలంగాణతో పాటు భారతదేశంలోని గ్రామీణ సమస్యలను, సంక్లిష్టతలను తన సినిమాల ద్వారా తెలియజెప్పారు శ్యామ్ బెనెగల్.
శ్యామ్‌బెనగల్ సినిమాలన్నీ విప్లవాత్మక, అభ్యుదయ ఆలోచనలు కలబోసినవే. వాస్తవికతకు, సహజత్వానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రజల యథార్థ జీవితానికి అద్దం పడుతూ సామాజిక మార్పుని ఆకాంక్షిస్తూ ఆయన సినిమాలు తీశారు. తెలంగాణ నేపథ్య కథాంశంతో తీసిన ‘అంకుర్’ (1974) సినిమాలో షబానా అజ్మీ, అనంత్‌నాగ్, సాధూ మోహర్, ప్రియా టెండూల్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. గ్రామీణ ప్రాంతంలో ఫ్యూడలిస్ట్ వ్యవస్థ తాలూకు దుర్మార్గాలపై సామాన్యుల తిరుగుబాటుకు దృశ్యరూపంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతిఘటన ఒక్కటే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుందని ఈ సినిమా ద్వారా చాటిచెప్పారు శ్యామ్‌బెనగల్. హిందీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డుని దక్కించుకున్న ‘మంథన్’ (1976) చిత్రాన్ని భారతీయ క్షీర విప్లవం నేపథ్యంలో తెరకెక్కించారు. భారతీయ క్షీరవిప్లవ పితామహుడిగా పేరు పొందిన వర్గీస్ కురియన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్‌షా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సహకార సంఘాల ద్వారా గ్రామీణుల్లో ఎలాంటి చైతన్యం తీసుకురావొచ్చనే అంశాన్ని చూపించారు. సామాన్యుల జీవన సంఘర్షణను ఇతివృత్తాలుగా ఎంచుకొని వాటిని కవితాత్మక, వాస్తవిక కోణంలో ఆవిష్కరించడం శ్యామ్‌బెనెగల్ శైలి. శ్యామ్‌బెనెగల్ దర్శకత్వ వహించిన నిశాంత్, మండి సినిమాలు బెంగాలీ దిగ్దర్శకుడు సత్యజిత్‌రే శైలిని పోలి ఉంటాయని విశ్లేషకులు చెబుతుంటారు. సామాజిక సమస్యల్ని తనదైన తాత్విక కోణంలో వెండితెర దృశ్యమానం చేస్తూ రియలిస్టిక్ సినిమాలకు నిర్వచనంలా నిలిచారు శ్యామ్ బెనెగల్.
దేశంలోని అత్యుత్తమ దర్శకులు, మేధావుల్లో శ్యామ్ బెనెగల్ ఒకరు. ఎంతోమంది సినీ ప్రముఖుల్ని పోత్సహించిన గొప్ప దార్శనీకుడాయన. ఆయన సినిమాలు జీవిత చిత్రాలు. మన సాంస్కృతిక సంపద ఆయన లఘు చిత్రాలు. వాస్తవిక పరిస్థితులను అద్దంపట్టే కథలను వెండితెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూశారని తెలిసి బాధేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా – చిరంజీవి
స్త్రీ జీవన దృశ్యకావ్యాలు
భారతీయ సినిమాకు సత్యజిత్‌రే తర్వాత అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిన దర్శకుడు శ్యామ్‌బెనెగల్. తొలి సినిమా ‘అంకుర్’తోనే 25 అవార్డులను గెలుచుకోవడం శ్యామ్ బెనెగల్కి మాత్రమే సాధ్యమైంది. న్యూ సినిమా, పాపులర్ సినిమాలకు ప్రత్యామ్నాయంగా సమాంతర సినిమాను సృష్టించారాయన. వాస్తవిక కథాంశమే ప్రాణంగా సినిమా తీయడంలో ఆయనకాయనే సాటి. ప్రధానంగా తన చిత్రాల్లో స్త్రీ పాత్రలను మలచడంలో బెనెగల్ ప్రతిభ మనకు కనిపిస్తుంది. అది ఆయన తొలి చిత్రం ‘అంకుర్’తోనే మొదలైంది.
అంకుర్: 1950 దశకం నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్య కథ. లక్ష్మీ, కిష్టయ్య అనే దంపతులు..గ్రామంలోని దొర సూర్య పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. చదువురాని ఆడమనిషి తను ఏ పరిస్థితుల్లో దారి తప్పినా అణచివేతను అనుభవించినా, పిరికితనం లేకుండా ధైర్యంతో తిరగబడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆమె చూపించే తెగువ ఏ పురుషుడికి తీసిపోదని చెబుతుంది లక్ష్మీ పాత్ర. ‘అంకుర్’ చిత్రం 1974లో కేంద్ర ప్రభుత్వ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ గెలుచుకుంది.
నిషాంత్: తెలంగాణలోని 1945 నాటి ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీల జీవితాలకు దర్పణం పడుతూ ఈ సినిమాను తెరకెక్కించారు. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన భూస్వాములపై ప్రతీకారం తీర్చుకునే యువతి నేపథ్యంలో కథ నడుస్తుంది. తనను నాశనం చేసిన దొరలను తుద ముట్టించాలనే లక్ష్యంతో వారి పంచనే ఉండి ప్రతీకారం తీర్చుకునే యువతి కథగా ‘నిషాంత్’ ఆకట్టుకుంటుంది. స్మితాపాటిల్, షబానా ఆజ్మీ నటించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పలు అవార్డులు పొందింది.
భూమిక: 1976లో ప్రసిద్ధ మరాఠి నటి హంసావాడేకర్ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. స్త్రీ తన వ్యక్తిగత జీవితంలో పురుషాధిపత్యానికి అన్ని సందర్భాల్లో అణిగిమణిగి ఉండటానికి ఇష్టపడదనే అంశాన్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. హంసావాడేకర్ పాత్రలో స్మితాపాటిల్ అద్భుతమైన అభినయాన్ని కనబరచి జాతీయ ఉత్తమ నటిగా అవార్డుని అందుకుంది. స్త్రీ వాద దృక్కోణంలోంచి ‘భూమిక’ సినిమాను మలిచిన తీరు శ్యామ్‌బెనెగల్ దర్శకత్వ ప్రతిభకు దర్పణం పడుతుంది. వేశ్యాగృహాల్లో ఉండే స్త్రీల దీనస్థితుల నేపథ్యంలో తీసిన ‘మండీ’ మరో గొప్ప చిత్రం. అలాగే జునూన్, సూరజ్ కా సాత్యాఘోడా వంటి చిత్రాల్లో స్త్రీ పాత్రలు కూడా గొప్పగా ఉంటాయి. ‘మమ్మో’ (1995) చిత్రంలో దేశ విభజన ముగ్గురు అక్కాచెల్లెళ్ల్ల నడుమ సృష్టించిన విషాదాన్ని కళ్లకుకట్టి చూపుతాడు శ్యాంబెనెగల్.
సర్దారీ బేగం: సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ కళాకారిణి సర్దారీబేగం ఆ సంప్రదాయాల మీద తిరుగుబాటు చేసిన కథాంశమిది. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా తన వ్యక్తిత్వాన్ని, తనలోని ‘కళ’ను కాపాడుకుంటూ స్త్రీ ధైర్యశాలిగా నిలబడుతుందని శ్యామ్‌బెనెగల్ చూపుతాడు.
జుబేదా: తను కోరుకున్న స్వేచ్ఛ కోసం స్త్రీ ఏ సాహసానికైనా వొడిగడుతుందని, పైగా ప్రేమ కోసమైతే ఆ సాహసానికి హద్దులే ఉండవని తెలియజెప్పే చిత్రం ‘జుబేదా’. ఇది 1940-80 నాటి కథ. ఈ సినిమా అంతా అనేక మలుపులతో ఉద్విగ్నంగా సాగుతుంది. శ్యామ్‌బెనెగల్ చిత్రాల్లో అత్యధికం స్త్రీ జీవన దృశ్యకావ్యాలే. అవి సామాజిక చైతన్యాన్ని, స్వేచ్ఛను, మానవీయ కోణాలకు, మానవ సంబంధాల అన్వేషణలకు దర్పణం పడతాయి. తొలినాటి ఆయన చిత్రాలు హైదరాబాద్ పరిసరాల్లో తయారైనవే. తెలుగులో ఆయన తీసిన ఒకే ఒక చిత్రం ‘అనుగ్రహం’ (1978) . దేశవిదేశాల్లో గొప్ప పేరున్న శ్యామ్‌బెనెగల్ హైదరాబాదీ కావడం మనకు గర్వకారణం