సాధారణంగా వేసవి సీజన్ అంటే ప్రేక్షకులకు పండగే. పెద్ద హీరోల చిత్రాలతో బాక్సాఫీస్ కళకళలాడుతుంటుంది. అయితే ఈ వేసవి సీజన్లో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది వారాలుగా పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడం, ఐపీఎల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల హడావుడి వల్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ పూర్తిగా తగ్గిపోయింది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు కూడా భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 250 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో దాదాపు పది రోజుల పాటు ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లను తాత్కాలికంగా మూసివేయబోతున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. తెలంగాణలో మొత్తం 250 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 రాజధాని హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
పెద్ద హీరోల సినిమాలు లేకపోవడమే..
ప్రతి వేసవిలో పెద్ద హీరోల చిత్రాలు రావడం ఓ ఆనవాయితీగా మారింది. అయితే ఈసారి పరిస్థితి తారుమారైంది. ఈ సమ్మర్లో ఇప్పటివరకు ఒక్క పెద్ద హీరో సినిమా విడుదల కాలేదు. ఏప్రిల్‌లో రావాల్సిన ఎన్టీఆర్ ‘దేవర’, మే రెండో వారంలో విడుదలకు సిద్ధమైన ప్రభాస్ ‘కల్కి’ వాయిదా పడటంతో బాక్సాఫీస్ కళతప్పింది. కొన్ని చిన్న సినిమాలు విడుదలైనా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తప్పని సరిగా టెంపరరీ షట్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారని అంటున్నారు.
‘ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం కాదిది. థియేటర్ల యాజమాన్యాలు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తేమి కాదు. గత నెల రోజులుగా ఆక్యుపెన్సీ లేని కారణంగా చాలా థియేటర్లలో షోలను రద్దు చేస్తున్నారు. నిర్మాతలు వ్యయాలను భరిస్తామని ముందుకొస్తే ఆయా థియేటర్ల వారు షోస్‌ను యథావిధిగా నడుపుకునే వీలుంటుంది. ఈ తాత్కాలిక షట్డౌన్కు కొత్త సినిమాలు ఎక్కువగా రాకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు సరైన పబ్లిసిటీ లేని కారణంగా ప్రేక్షకులకు చేరువకాలేకపోతున్నాయి. మళ్లీ కొత్త సినిమాలు వచ్చినప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది’
– విజయేందర్ రెడ్డి (తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు)