గంగిరెద్దుల అబ్బాయి, జోగినిగా మారిన అమ్మాయి.. ఇద్దరూ ప్రేమలో పడితే ఏం జరిగింది? వారిపై ఊరు ఎలా స్పందించింది? అనే ప్రశ్నలకు సమాధానంగా రూపొందిన పల్లెటూరి ప్రేమకథ ‘శరపంజరం’. నవీన్‌కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ కథానాయిక. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించి, ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘జీరో బడ్జెట్లో, కేవలం స్నేహితుల సహకారంతో మొదలుపెట్టిన ఈ యజ్ఞం ఇప్పుడు విడుదలకు వచ్చిందంటే మేం విజయం సాధించినట్టే లెక్క. ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నాను’ అని నవీన్‌కుమార్ గట్టు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులతోపాటు, ఆహ్వానితులు కూడా సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. ఈ చిత్రానికి సంగీతం మల్లిక్ ఎం.వి.కె, కెమెరా: మస్తాన్ సిరిపాటి, నిర్మాణ సహకారం: టి.గణపతిరావు.