Shaitan Web-Series Trailer | కరోనా పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమా టీవీల్లో చూడాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టేది. కానీ ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ వెతికేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ మధ్య వెబ్ సిరీస్ల ట్రెండ్ ఎక్కువైపోయింది. కంటెంట్ బాగుంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. స్టార్ నటీనటులు కూడా వెబ్ సిరీస్లో నటించాలని తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెబ్ సిరీస్లో ముఖ్యమైన అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. దాంతో తమ క్రేజ్ కూడా దేశ వ్యాప్తంగా పెరుగుతుందని భావిస్తున్నారు.
కాగా తాజాగా అలాంటి వెబ్ సిరీస్ ఒకటి విడుదలకు సిద్ధమైంది. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ రూపొందించిన సైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15న డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందట. అయితే బోల్డ్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువ మోతాదులోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను ఆదివారం రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. రిషీ, శెల్లి, దేవయాని ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. ఇక ఇటీవలే విడులదైన సేవ్ ది టైగర్స్ అనే కామెడీ వెబ్ సిరీస్ ను కూడా రూపొందించింది మహి. వి. రాఘవే. ఈ వెబ్ సిరీస్ ఆశేశ ఆదరణ దక్కించుకుంది.