గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక సతమతమవుతున్నారు బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్‌ఖాన్. ప్రస్తుతం ఆయన ‘పఠాన్’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా త్వరలో సెట్స్‌మీదకు రానుంది. మంగళవారం షారుఖ్‌ఖాన్ కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. సామాజిక సందేశాల్ని వినోదాత్మక పంథాలో ఆవిష్కరించే రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ ‘డంకీ’ పేరుతో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఇందులో తాప్సీ కథానాయికగా నటించనుంది.
ఈ సినిమా వివరాల్ని షారుఖ్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని షారుఖ్‌ఖాన్ తెలిపారు. ఈ చిత్రానికి స్వీయ నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షారుఖ్‌ఖాన్ సతీమణి గౌరీఖాన్ నిర్మించనుంది. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. షారుఖ్‌ఖాన్‌తో సినిమా చేయాలన్న తన స్వప్నం ఇన్నాళ్లకు ఫలించించిందని రాజ్‌కుమార్ హిరాణి సంతోషం వ్యక్తం చేశారు. కెనడాకు అక్రమంగా వలస వెళ్లిన పంజాబీ యువకుడి నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.