Pathaan Collections | షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల వసూళ్లను దాటి రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన 29 రోజుల్లో 1005 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని చిత్రబృందం పేర్కొంది. ఇందులో 384 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ ద్వారా లభించాయని తెలిపింది. 139కోట్లతో అమెరికాలో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా ‘పఠాన్’ నిలిచింది.
ఇక దేశీయంగా 511 కోట్లు హిందీ బెల్ట్ నుంచే వచ్చాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాజా వసూళ్లతో భారతీయ సినీ చరిత్రలో వెయ్యికోట్ల మైలురాయిని దాటిన ఐదో చిత్రంగా ‘పఠాన్’ నిలిచింది. అంతకు ముందు దంగల్, బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వెయ్యికోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు నమోదు చేశాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ‘పఠాన్’ చిత్రం హై యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది.