Salaar v/s Dunki | ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం ఏమో కానీ.. సలార్ కొత్త రిలీజ్ డేట్ వల్ల మాత్రం షారుఖ్ అభిమానులు మండిపోతున్నారు. ఎప్పుడో క్రిస్మస్ వీక్‌పై ఖర్చీఫ్ వేసుకున్న డుంకీ సినిమాకు సలార్ పోటీగా దిగడం వాళ్లకు ఏమాత్రం నచ్చడం లేదు. దాంతో షారుఖ్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా సలార్ సినిమాపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఉగ్రం సినిమాకు సలార్ రీమేక్ అని.. డుంకీకి పోటీగా వస్తే పోస్టర్ ఖర్చులు కూడా మిగలవని పోస్ట్‌లు పెడుతున్నారు. దానికి తోడు ఇటీవలే ఉగ్రం సినిమా హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలిగించారు. దాంతో వాళ్ల కామెంట్స్‌కు బలం చేకూరినట్టయింది. ఇక ఇవన్నీ చూసి రెబల్ ఫ్యాన్స్ మాత్రం గమ్ముగా ఉంటారా? వాళ్లు కూడా తిరిగి షారుఖ్ ఫ్యాన్స్‌పై మాటల యుద్దాన్ని చేస్తున్నారు.
డుంకీ సినిమా సౌత్ రీమేక్ అని.. ఆరేళ్ల కిందట దుల్కర్ నటించిన కామ్రేడ్ ఆఫ్ ఆమెరికా సినిమాకు రీమేక్ అని, ఆ సినిమానే హిట్టు కాలేదు. ఇక ఇప్పుడు డుంకీ హిట్టయ్యే చాన్సే లేదని.. అందులోనూ సలార్‌కు పోటీగా వస్తే తిప్పలు తప్పవని మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్‌తో ట్విట్టర్ వేడెక్కిపోతుంది. ఒకరి మీద ఒకరు ఇలా సిల్లీగా కామెంట్స్ చేసుకుంటున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం ఇద్దరి ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. సలార్‌కు సౌత్ సహా నార్త్‌లోనూ భీభత్సమైన అంచనాలున్నాయి. అందులోనూ కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఇక షారుఖ్ డుంకీపై కూడా తక్కువ అంచనాలు పెట్టుకోలేం. అసలే ఒకే ఏడాదిలో రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలతో జోష్ మీదున్న షారుఖ్‌కు డుంకీ హ్యాట్రిక్ హిట్టవుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. అందులోనూ అపజయమే ఎరుగుని రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడంతో జనాల్లో తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో పెద్దగా ప్రభావం చూపదు కానీ.. నార్త్‌లో మట్టుకు సలార్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరీ ఈ రెండు సినిమాలు ఒక ఒప్పందానికి వచ్చి పోస్ట్ పోన్ అవుతాయో.. లేదంటే పోటీకి దిగుతాయో చూడాలి.