సత్యం రాజేష్, చిత్రం శ్రీను, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కళాపురం’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజినీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ..‘నేను తొలిసారి చేస్తున్న వినోదాత్మక చిత్రమిది. ఈ సినిమాలో కామెడీ ఉన్నా ఎక్కడా చెడు మాటలు, అశ్లీలత ఉండదు. సినిమా ఆద్యంతం నవ్వించాలనే ప్రయత్నం చేశాం. సినిమా చూసిన వాళ్లంతా సంతోషంగా బయటకొస్తారని చెప్పగలను’ అన్నారు.
నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ…‘మీకు కావాల్సినన్ని నవ్వులు పంచే చిత్రమిది. దర్శకుడు కరుణ కుమార్ నుంచి మరో వైవిధ్యమైన సినిమా చూస్తారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రజినీ తాళ్లూరి, నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.