Sardar 2 | కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, విలక్షణ దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్‌హిట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న ‘సర్దార్ 2’ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేలా ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, భారీ విజువల్స్‌తో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.సెప్టెంబర్ 10న ‘సర్దార్ 2’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్‌ను గమనిస్తే ఈసారి దర్శకుడు కథను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. భారీ బ్లాక్ ఆప్స్ మిషన్, విదేశీ లొకేషన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఫైట్స్, పేలుళ్లు, ఛేజింగ్ సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం యాక్షన్‌తో నిండిపోయింది. రెగ్యులర్ స్పై థ్రిల్లర్లకు భిన్నంగా కథలో బలమైన ఎమోషనల్ టచ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
‘సర్దార్ 2’ కథలో సీక్వెల్‌తో పాటు ప్రీక్వెల్ అంశాలు కూడా మిళితమైనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో మురుగన్ భక్తుడిగా ఉన్న చంద్రబోస్.. పరిస్థితుల కారణంగా సీక్రెట్ ఏజెంట్‌గా ఎలా మారాడు? అతడి గతంలో జరిగిన సంఘటనలు ప్రస్తుతం ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? అనే అంశాలను కథలో ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది. తాను పూర్తి చేసిన ఓ మిషన్‌కు సంబంధించిన పరిణామాలు జీవితాంతం తనను వెంటాడుతున్నాయనే అంశం కూడా కథలో కీలకంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత కాలంలో చంద్రబోస్ కుమారుడు విజయ్ ప్రకాష్ కూడా అదే ఆపరేషన్లోకి అడుగుపెట్టడం సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకొచ్చేలా ఉంది.
ట్రైలర్‌లోని డైలాగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు బాస్” అంటూ కార్తి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. గతంలో చేసిన తప్పులు జీవితాంతం వెంటాడే శాపంలా మారుతాయనే ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అలాగే “నన్ను వదిలేయమంటున్నావా.. లేక నమ్మమంటున్నావా?” అంటూ సర్దార్ చెప్పే డైలాగ్ కథలోని సంఘర్షణను తెలియజేస్తోంది. యాక్షన్‌తో పాటు పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్కి కూడా దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ట్రైలర్లో అసలు హైలెట్ మాత్రం విలన్‌గా నటిస్తున్న ఎస్జే సూర్య. ‘బ్లాక్ డాగర్’ అనే పాత్రలో ఆయన స్టైలిష్‌గా, అదే సమయంలో క్రూరమైన విలనిజంతో కనిపించారు. “సర్దార్.. నేను నీ ఫ్యాన్‌ని. ఫ్యాన్‌బాయ్ మూమెంట్ అంటే ఏంటో నీకు చూపిస్తా” అంటూ ఆయన చెప్పే డైలాగ్ ట్రైలర్లో గూస్బంప్స్ తెప్పిస్తోంది.ట్రైలర్‌కు సంగీత దర్శకుడు సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్‌గా నిలిచింది. పవర్ఫుల్ మ్యూజిక్‌తో యాక్షన్ ఎపిసోడ్స్‌ను మరింత ఎలివేట్ చేశారు. భారీ యాక్షన్ సీన్స్, వేగవంతమైన ఎడిటింగ్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిపి ట్రైలర్‌కు మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాయి.
ఈ చిత్రంలో కార్తికి జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ యాక్షన్ స్కేల్, ఆసక్తికరమైన స్పై కథ, బలమైన ఎమోషన్స్, కార్తి-ఎస్జే సూర్య పోరు వంటి అంశాలతో ‘సర్దార్ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ట్రైలర్‌తో అంచనాలు పెంచుకున్న ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.