Sanober Pardiwalla | సినిమాల్లో స్టంట్స్ అనగానే గుర్తుకువచ్చేది నాయకులు, వాళ్లను నడిపించే ఫైట్ మాస్టర్లే! కానీ, మహిళలు కూడా ఈ రంగంలో ఉంటారనీ, మగవారితో సమానంగా కష్టపడుతుంటారనీ చాలామంది గుర్తించరు. ఈ పురుషాధిక్య రంగంలో 12 ఏళ్లకే అడుగుపెట్టి, 200లకు పైగా చిత్రాల్లో పనిచేశారు. సనోబర్. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్న ఆమెకు అనుకోకుండా సినిమాలో అవకాశం వచ్చింది. సెట్లో అడుగుపెట్టిన మొదటి రోజే తను ఆ రంగంలో స్థిరపడగలనని నమ్మకం కలిగింది. తన ఆసక్తిని చూసి ఇంట్లో పెద్దలు అడ్డు చెప్పలేదు సరికదా, మరింతగా రాణించమంటూ ప్రోత్సహించారు.
అలాగని తన ప్రయాణం అంత సజావుగా ఏమీ సాగలేదు. ఆడపిల్లే కదా అని చులకన చేయడం, చిన్నపిల్లే కదా అని పట్టించుకోకపోవడం లాంటివి తరచూ ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ తట్టుకుంటూ, గుర్తింపు లేకపోయినా తనను తాను ఊరడించుకుంటూ కెరీర్ కొనసాగించారు. ఇలాంటప్పుడు కుంగిపోకుండా మనల్ని మనం సంబాళించుకోవాలనీ… బాధ, సంతోషాల మధ్య ఏదో ఒక ఉద్వేగాన్ని ఎంచుకునే అధికారం మనకే ఉంటుందనీ అంటారు సనోబర్. చిరాగ్గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే, దానివల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరాన్నే కాకుండా మనసును కూడా తేలికపరుస్తాయని సూచిస్తారు.