Sanjay Dutt | ఒకప్పుడు తెలుగు హీరోలు హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు బాలీవుడ్ హీరోలు ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీటౌన్ స్టార్స్ దక్షిణాది సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దక్షిణాది సినిమాలపై తనకున్న అభిమానాన్ని తెలియజేశారు. సౌత్ సినిమాల్లో నటించాలని ఉందని తెలిపారు.
ప్రేమ్ దర్శకత్వంలో ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కేడీ- ది డెవిల్’. ఈ సినిమా టీజర్ హిందీ వర్షన్‌కు సంజయ్‌దత్ వాయిస్ అందించారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ దత్.. సౌత్ సినిమాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘కేజీఎఫ్-2 సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు దర్శకుడు రాజమౌళి మంచి మిత్రుడు. సినిమాపై ఉన్న ప్రేమంతా వారు తీసే చిత్రాల్లో కనిపిస్తుంటుంది. హీరో యశ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు ధ్రువ సర్జాతో నటించేందుకు ఎదురుచూస్తున్నా. ఇంకా మరెన్నో దక్షణాది సినిమాల్లో నటించాలని ఉంది’ అని తెలిపారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల వర్షం కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.1200 కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో సంజయ్ దత్.. అధీరగా అలరంచిన విషయం తెలిసిందే.