Samantha | సినిమాలు చేయకపోయినా సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇసుమంత కూడా తగ్గలేదు. సాంఘిక మాధ్యమాల్లో ఆమెను అనుసరించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. తను ఇన్స్టాలో ఏ పోస్ట్ పెట్టినా దానికి స్పందన అనూహ్యంగానే ఉంటుంది. సామ్ కొత్త సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, తనేమో తీరిగ్గా ఇన్స్టాలో ఫొటోలను పోస్ట్ చేస్తూ కాలం గడిపేస్తున్నది. అయితే.. తాజాగా ఆమె ఇన్స్టాలో ఓ ఫొటో ప్రత్యక్షమైంది. అది ఆమె తాజా సినిమా పోస్టర్.
సినిమాపేరు ‘మాయింటి బంగారం’. సినిమా పేరైతే సున్నితంగా ఉందిగానీ.. పోస్టర్ నిండా వయోలెన్సే కనిపిస్తున్నది. ఎర్ర చీర.. మెడలో మంగళసూత్రం.. రక్తసిక్తమైన శరీరం.. చేతిలో తుపాకీ.. చూడ్డానికి గృహిణిలా కనిపిస్తున్నది. అయితే.. ఆ రూపం చూస్తుంటే అపరకాళికలా అనిపిస్తున్నది.
మరి ఈ కథేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. విశేషమేంటంటే.. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’పై సామ్ తెరకెక్కించే సినిమా ఇదే. అయితే.. ఈ పోస్టర్లో సమంత తప్ప మిగతా ఏ వివరాలూ లేవు. అభిమానులు మాత్రం ఆనందంతో ‘తలైవి ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.