Salman Khan Father | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, దిగ్గజ సినీ రచయిత సలీం ఖాన్ తన కుటుంబ ఆహార విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబం ఇప్పటివరకు గొడ్డు మాంసం తినలేదని తెలిపారు. తాము ముస్లింలమైనప్పటికీ గొడ్డు మాంసం తమ కుటుంబంలో నిషిద్ధమని ఆయన తెలిపారు. ఇండోర్ నుంచి వచ్చాక కూడా తాము బిఫ్ తినలేదని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది ముస్లింలు గొడ్డు మాంసం తింటారని ఎందుకంటే అది చౌకైన మాంసం అని ఆయన పేర్కొన్నారు.
మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం.. ఆవు పాలు తల్లి పాలతో సమానమని.. అందుకే మేము దూరంగా ఉన్నామని తెలిపాడు. అయితే ఫుడ్ విషయంలో ఎవరి ఇష్టం వారిదని ఎవరేం తిన్నా అది వారికి ఇష్టం ఉండే తింటారని తెలిపాడు.
హిందూ సంప్రదాయాలంటే తనకు ఎంతో ఇష్టమని సలీం ఖాన్ పేర్కొన్నారు. చిన్నప్పుడు తమ వీధిలో హిందూ పండుగలను అత్యంత ఘనంగా జరుపుకునేవారమని, వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొనేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన భార్య సుశీలతో పెళ్లికి తమ కుటుంబం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, దీనివల్ల తమ కుటుంబంలో అన్ని పండుగలను జరుపుకోవడం, అన్ని సంప్రదాయాలను గౌరవించడం అలవాటయ్యిందని ఆయన తెలిపారు. అందుకే తాము 60 ఏళ్లుగా సంతోషంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. అంతేగాకుండా.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఇంట్లో గణపతిని ప్రతిష్టించి పూజలు చేశామని సలీం ఖాన్ వెల్లడించారు. తన కుటుంబం అన్ని మతాలను గౌరవిస్తుందని, సామరస్యంగా జీవించడంలో ఇది తమకు దోహదపడిందని ఆయన చెప్పారు.