Chandrabose | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. కాగా, తాను రాసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం పట్ల గేయ రచయిత చంద్రబోస్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ మేరకు పాటకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఆస్కార్ నామినేషన్‌కు నాటు నాటు పాట ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణి సర్, రాజమౌళి సర్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాటలో నేను రాసినదంతా కూడా నా ఊరు, నా చిన్ననాటి జీవితం, కుటుంబ నేపథ్యం గురించే. నా అభిప్రాయాలు, జ్ఞాపకాలను పదాలుగా మలిచి పాటలో పెట్టానంతే. ఓ చిన్న గ్రామం, సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తికి నిజంగా ఇదొక గొప్ప విజయం. నమ్మలేకుండా, అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ పరిశీలనలో 15 పాటలు ఉంటే అందులో ‘నాటు నాటు..’ కూడా ఒకటి. అవతార్, నాటు నాటు మధ్య పోటీ ఉంటుందని అనుకున్నా. కానీ టాప్-5లో అవతార్ లేకుండా నాటు నాటు స్థానం సంపాదించింది’ అని చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందించిన ‘నాటు నాటు’ పాట ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలకు చంద్రబోస్ సన్నివేశానికి తగ్గ తెలుగు పదాలతో అందమైన సాహిత్యాన్ని అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గానంతో పాటను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. పాటలో హుక్‌స్టెప్ కోసం 80పైగా వేరియేషన్ స్టెప్స్‌ను ప్రేమ్ రక్షిత్ బృందం డిజైన్ చేసిందట. చివరికి భుజాలపై చేతులు వేసుకుని ఇద్దరూ ఒకే రకంగా కాళ్లు కదిలించే స్టెప్‌ను ఫైనల్ చేశారు. ఇద్దరూ ఒకే విధంగా స్టెప్ వేయడానికి 18 టేక్‌లు తీసుకున్నారట. ఈ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు.