‘నాతోపాటు ఎంతోమందిని హీరోలుగా నిలబెట్టిన వైజయంతీ సంస్థలో రోషన్ సినిమా చేయడం ఆనందంగా ఉంది. రోషన్ హాలీవుడ్ హీరోలా, యూరోపియన్ లుక్‌తో ఉంటాడు. నా రెండో సినిమా ‘మగధీర’ ఎంత హిట్ అయ్యిందో, తన రెండో సినిమా ‘చాంపియన్’ అంత విజయం సాధించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ చూస్తే ‘లగాన్’ గుర్తొచ్చింది. 1940ల కాలాన్ని అద్భుతంగా చూపించారు.
రోషన్‌లో మెచ్యూర్డ్ ఆర్టిస్టు కనిపించాడు. బిగ్ స్క్రీన్‌మీద చూడాలని ఆశగా ఉంది. 25న అందరం చూద్దాం.’ అని అగ్రహీరో రామ్‌చరణ్ అన్నారు. రోషన్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. అనస్వర రాజన్ కథానాయిక. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన రామ్‌చరణ్ పై విధంగా స్పందించారు. రోషన్ మాట్లాడుతూ ‘తొలి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాను.. ఇక ఆగను. ఈ సినిమాను నాకిచ్చిన దర్శకుడు ప్రదీప్‌కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇది మైఖెల్గాడి కథ. బైరాన్‌పల్లి అనే ఊరిలోని వీరుల కథ. ఇంతమంచి కథలో భాగం కావడం అదృష్టం. కళా దర్శకుడు తోట తరణి, డీవోపీ మధి, సంగీత దర్శకుడు మిక్కీ.జె మేయర్ వంటి దిగ్గజ టెక్నీషియన్స్ పనిచేశారీ సినిమాకు. వైజయంతీ సంస్థలో పనిచేసినందుకు గర్విస్తున్నా.
మా నాన్న ఐడెంటిటీనే నా ఐడెంటిటీ. ఆయన వల్లే ఇక్కడ ఉన్నా. చరణ్ అన్న ఈ వేడుకకు రావడంతో వేడుకకు నిండుదనం వచ్చింది.’ అని ఆనందం వెలిబుచ్చారు. రోషన్ లుక్, ప్రదీప్ కథ, వైజయంతీ మేకింగ్ వాల్యూస్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టాయని ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఇంకా కథానాయిక అనస్వర రాజన్, సీనియర్ నటుడు శ్రీకాంత్, నిర్మాత సి.అశ్వనీదత్, జెమినీకిరణ్, చిత్రబృందం పాల్గొన్నారు.