Actor Darshan | రేణుకాస్వామి హత్య కేసులో నిందితుల జ్యుడీషియల్ కస్టడీని కర్ణాటక కోర్టు పొడించింది. హీరో దర్శన్ తూగుదీప, హీరోయిన్ పవిత్ర గౌడ సహా 17 మంది నిందితులకు కస్టడీని సెప్టెంబర్ 9 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో బధవారం నిందితులను బెంగళూరు, తమకూరు జైల్ల నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. హీరో దర్శన్‌ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారికి తరలించేందుకు 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనుమతించారు.
జైలు ఆవరణలో దర్శన్, మరో ముగ్గురితో క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి కలిసి ఉన్న ఫొటో వైరల్‌గా మారింది. జైలులో దర్శన్‌కు రాజభోగాలు కల్పిస్తున్నట్లుగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో నిందితులను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న జైళ్లకు తరలించేందుకు అనుమతించింది. దర్శన్ కుర్చీపై కూర్చొని చేతిలో సిగరేట్, కాఫీ మగ్ కనిపించాడు. అలాగే వీడియో కాల్లో మాట్లాడుతున్న వీడియో సైతం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
నిందితులు పవన్, రాఘవేంద్ర, నందీష్‌లను మైసూర్ జైలుకు.. జగదీశ్, లక్ష్మణ్‌లను శివమొగ్గ జైలుకు, ధనరాజ్‌ను ధార్వాడ్ జైలుకు, వినయ్‌ని విజయపుర జైలుకు, నాగరాజ్‌ను గుల్బర్గా జైలుకు, ప్రదోష్‌ను బెలగావిలోని జైలుకు తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో వైపు దర్శన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తొమ్మిది మంది జైలు అధికారులను పరప్పన అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు జైలుచట్టం, బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద దర్శన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.