Actor Darshan | రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. బెంగళూరు కోర్టు నటుడిని జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇటీవల పోలీసుల విజ్ఞప్తి మేరకు కోర్టు రెండు రోజులు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. శనివారంతో గడువు ముగిసిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నటుడితో పాటు కేసులో నిందితులును అన్నపూర్ణేశ్వరి పోలీస్‌స్టేషన్ నుంచి బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో దర్శన్‌కు కోర్టు జులై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
కోర్టు ఆదేశాల మేరకు దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను కోర్టు నుంచి పరప్పన అగ్రహార జైలుకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామిని హత్య చేసిన కేసులో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ, మరో 15 మందిని ఇటీవల అరెస్టు చేశారు. పోలీసులు రిమాండ్ దరఖాస్తు పిటిషన్ వేయగా.. 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఉత్తర్వులు జారీ చేశారు. హీరో దర్శన్‌తో పాటు వినయ్, ధనరాజ్, ప్రదోష్ 13 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. పవిత్ర గౌడతో పాటు మరో 12 మందిని 11 రోజుల పాటు పోలీసులు విచారించిన అనంతరం ఈ నెల 20న జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.