PV Gangadharan | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, ఏఐసీసీ సభ్యుడు, వ్యాపారవేత్త పీవీ గంగాధరన్ (80) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 6:30 గంటలకు కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఇక నిర్మాత పీవీ మృతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
గంగాధరన్ కేరళ సినీ ఇండస్ట్రీలో గృహలక్ష్మి ప్రొడక్షన్స్ స్థాపించి సుజాత (1977), ఒరు వడక్కన్ వీరగాథ (1986), కనక్కినవు (1997), వీండుం చిల వీట్టుకార్యంగల్ (1999), అచ్చువింటే అమ్మ (2005), నోట్‌బుక్ (2006) వంటి 20కి పైగా చిత్రాలను నిర్మించారు. సుజాత (1977) అతని మొదటి సినిమా కాగా.. జానకి జానే (2023) అతని చివరి సినిమా.
ఇక పీవీ గంగాధరన్ నిర్మించిన కనక్కినవు (1997) చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటెగ్రేషన్ విభాగంలో నర్గీస్ దత్ నేషనల్ అవార్డును గెలుచుకుంది. 2000 జాతీయ చలనచిత్ర అవార్డులలో శాంతం (2001) సినిమా ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైంది. ఇక ఇవే కాకుండా ఒరు వడక్కన్ వీరగాథ (1986), కనక్కినవు (1997), వీండుం చిల వీట్టుకార్యంగల్ (1999), అచ్చువింటే అమ్మ (2005), నోట్‌బుక్ (2006) సినిమాలు రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకున్నాయి.
సినీ పరిశ్రమలో నిర్మాతగా విజయవంతమైన కెరీర్‌తో పాటు, అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాతల సంఘాల సమాఖ్యలో వైస్ ప్రెసిడెంట్‌గా గంగాధరన్ కీలక పదవిని కలిగి ఉన్నారు. దీనితో పాటు అతను కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.