తన శైలికి భిన్నంగా భక్తి, భావోద్వేగాలతో కూడుకున్న యాక్షన్ కథాంశంతో అగ్ర హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఇందులో కూతురంటే ప్రాణమిచ్చే తండ్రిగా ఆయన కనిపిస్తారు. శివ నిర్వాణ దర్శకుడు. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఫాదర్స్ డే సందర్భంగా ‘ఇరుముడి’ చిత్రబృందం ఓ అందమైన ప్రత్యేక పోస్టర్ని విడుదల చేసింది. కూతురి నుదుటిపై ముద్దిస్తున్న నాన్నలా రవితేజ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలను ఈ పోస్టర్ హృద్యంగా ఆవిష్కరించింది.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ ఆడపిల్ల తండ్రిగా రవితేజ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూస్తారని, కమర్షియల్ అంశాలన్నీ సమపాళ్లలో రంగరించిన చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. ప్రియా భవానీశంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్‌ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక, బేబీ నక్షత్ర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.