Ravi Teja | మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇరుముడి ప్రస్తుతం టాలీవుడ్లో మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి అనౌన్స్మెంట్ నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా డివోషనల్ టచ్‌తో పాటు ఎమోషనల్ డ్రామాను కలగలిపిన కథాంశంతో ఈ సినిమా రాబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, రవితేజ గత చిత్రాలకు భిన్నంగా ఓ పవర్ఫుల్ మరియు భావోద్వేగభరిత పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, తాజాగా లభించిన సమాచారం ప్రకారం చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఇంకా సుమారు నెల రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మేకర్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో పనులు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు భిన్నమైన ప్రాజెక్టులతో తన మార్క్ చూపించిన జీవి ప్రకాష్.. ‘ఇరుముడి’ కోసం కూడా ప్రత్యేకమైన మ్యూజిక్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ పట్ల ఆయనే ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉన్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.
భారీ నిర్మాణ విలువలతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల వరుస విజయాలతో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచిన మైత్రి సంస్థ.. ‘ఇరుముడి’ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. యాక్షన్, భక్తి, ఎమోషన్ల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ సంపాదించుకోవడం విశేషం. అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.