‘ఇరుముడి’ అద్భుత విజయంతో రవితేజ ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. ఈ విజయానందంలో రవితేజ వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. హసిత్‌గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. దిల్‌రాజు నిర్మించే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా రవితేజ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
‘సరిపోదా శనివారం’ చిత్రంతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా చేయబోతున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తనదైన శైలి వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. రవితేజ-హసిత్‌గోలి కాంబినేషన్ సినిమా పూర్తయిన తర్వాతే ఈ కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌మీదకు వెళ్లనుంది.